గొయ్యి తవ్వడంలో సక్సెస్ అవుతున్న మోడీ !

Wednesday, October 3rd, 2018, 09:46:22 AM IST

మన దేశ రాజకీయ చరిత్రలో రైతుల్ని విస్మరించిన, వారిని అణచివేయాలని చూసిన పార్టీలు ఏవీ ఎక్కువ కాలం అధికారంలో నిలబడిన దాఖలాలు లేవు. ఈ సంగతి మన ప్రధాని మోడీకి తెలియంది కాదు. అయినా ఆయన నిన్న ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై బాల ప్రదర్శనకు తెగబడ్డారు. రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు వంటి డిమాండ్లతో దాదాపు 30 వేల మంది రైతులు కిసాన్ క్రాంతి యాత్ర పేరిట ఉత్తరప్రదేశ్ సరిహద్దుల నుండి ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు.

కానీ భారీగా మోహరించిన పోలీసులు వారిని ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా అడ్డగించారు. అయినా రైతులు ముందుకు కదిలే ప్రయత్నం చెయ్యడంతో వారిపై పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించి నిరంకుశ పాలన అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఈ ఘర్షణలో పలువురు రైతులు గాయాలపాలయ్యారు. ఉద్యమంగా వచ్చిన రైతులతో కనీసం చర్చలు కూడ జరపకుండా ఇలా నగరం బయటి నుండే తరిమికొట్టాలని చూసిన మోడీ తీరు పట్ల దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపేది లేదంటున్న రైతు నాయకులు ఇకపై ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ మట్టికరవడం ఖాయమని స్పష్టం చేశారు. లోపల ఎన్ని విభేధాలున్నా అన్ని వర్గాలు ఏకమయ్యే ఒకే ఒక్క అంశం రైతులు. రైతులపై ఇలా దాష్టీకానికి తెగబడే ప్రభుత్వం, నాయకులూ ఎంత గొప్పవారైనా వారిని ఎవరూ సమర్థించరు. నిన్నటి అహంకారపు చర్యతో మోడీ పై ప్రజల్లో ఉన్న నెగెటివ్ ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువైంది. ఈ సంఘటన పట్ల స్పందించిన పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం తన పాలనలో మోడీ చేసిన పెద్ద తప్పుల్లో ఇది కూడ ఒకటని, ఆయన బీజేపీకి గొయ్యి తవ్వడంలో సక్సెస్ అవుతున్నారని ఎద్దేవా చేశారు.