మోడీకి పెద్దలను గౌరవించడం తెలియదు : రాహుల్ గాంధీ

Tuesday, June 12th, 2018, 11:03:17 PM IST

ఏఐసిసి జాతీయ అధ్యక్షలు రాహుల్ గాంధీ నేడు ముంబైలో నిర్వహించిన ఒక బహిరంగ సమావేశంలో మోడీ పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని హోదాలో వున్న ఆయనకు తనకన్నా పెద్దవారికి మర్యాద ఇవ్వడం తెలియదని విమర్శించారు. వాస్తవానికి మోడీకి గురువుగా నిలిచే ఎల్ కె అద్వానీకి మోడీ సరైన రీతిలో గౌరవం ఇవ్వరని అన్నారు. మనకు గురువులు తండ్రితో సమానం అని, అటువంటివారికి ఎంత చేసినా, ఏమి చేసినా తక్కువేనని రాహుల్ అభిప్రాయపడ్డారు. అలానే రెండు రోజులనుండి ఆరోగ్యం సరిలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాజపేయి ని తాను హాస్పిటల్ కు వెళ్లి మరీ పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాని అన్నారు. ఇదివరకు కొన్ని ఎన్నికల్లో వాజపేయికి వ్యతిరేకంగా తమపార్టీ పనిచేసిందని, అయిప్పటికీ దేశాన్ని మంచి ప్రగతి బాటన ముందుకు తీసుకెళ్లి పరిపాలన చేసిన వ్యక్తి వాజిపేయి అని రాహుల్ కొనియాడారు. అటువంటి పెద్ద వారిని గౌరవించడం, వారి యోగక్షేమాలు కనుక్కోవడం మన భారతీయుల సంస్కృతి అని అన్నారు.

కొన్నాళ్ల క్రితం ఒక సీనియర్ నాయకుడు తనతో మాట్లాడుతూ, దాదాపు యాభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసాను. అయితే నాకు ఇన్నాళ్లకు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిందని, అదేమిటంటే కాంగ్రెస్ హయాంలోనే దేశం, దేశ ప్రజలు భద్రంగా, ఆనందంగా ఉంటారని తెలుసుకున్నాను అని పెద్దాయన అన్నారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందని, అందుకు ప్రత్యక్ష నిదర్శనం మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికలే నిలువెత్తు సాక్ష్యం అన్నారు. గుజరాత్ లో కూడా వారు అతి కష్టం మీద అధికారాన్ని పొందారని, ఇక రానున్న రోజుల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి భంగపాటు తప్పదని, ఇకపోతే మొత్తంగా 2019 ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం చవిచూడక తప్పదని ఆయన జోస్యం చెప్పారు……

  •  
  •  
  •  
  •  

Comments