అంబానీకి మోడీ కావాలనే ఫేవర్ చేశారా ?

Wednesday, October 17th, 2018, 06:20:25 PM IST

రఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో మోడీ ప్రభుత్వం కావాలనే అనీల్ అంబానీకి ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఒప్పందాన్ని కుదిర్చారని వస్తుం ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తూ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ సంస్థ కార్మిక సంఘాల సమావేశాల వివరాలు బయటికొచ్చాయి. వీటి ద్వారా డసోకు కాంట్రాక్ట్ ఇచ్చినందుకుగాను ఇండియాలో రిలయన్స్ సంస్థతో తప్పనిసరిగా భాగస్వామ్యం కుదుర్చుకోవాల్సివచ్చినట్టు తెలుస్తోంది.

36 రఫెల్ యుద్ధ విమానాల తయారీకి ఫ్రాన్స్ సంస్థతో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ మొత్తంలో 50 శాతాన్ని తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనే నిబంధన ఉంది. ఈ పెట్టుబడికి రిలయన్స్ సంస్థను ఎంచుకోవాలని ఇండియానే సలహా ఇచ్చిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ గతంలోనే తెలిపారు. వీటికి బలాన్నిస్తూ సీజీటీ కార్మిక్ సంఘం ప్రకటనలో డీల్ కావాలంటే ఇండియాలో డసో రిలయన్స్ ఏరోస్పేస్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేస్తామని దానికి భాగస్వామ్యం ఇవ్వాలని భారత్ తెలిపినట్టు ఉందట. రెండవ కార్మిక సంఘం సీఎఫ్డీటీ కూడ ఈ తప్పనిసరి డీల్ ను ప్రకటనలో పేర్కొనగా డసో మాత్రం అలాంటిదేం లేదని అంటోంది. ఈ వ్యవహారం మొత్తాన్ని చూస్తుంటే మోడీ గవర్నమెంట్ ఉద్దేశ్యపూర్వకంగానే భాగస్వామ్యాన్ని అంబానీకి కట్టబెట్టినట్టు అనిపిస్తోంది.

దీనిపై నివేదికను తయారుచేయడానికి కాగ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో మొదలుకానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ నివేదికను కాగ్ సమర్పించనుంది. మరి ఈ నివేదిక ఏం నిరూపిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments