అర్బన్ నక్సల్స్ మీద నిప్పుల వర్షం కురిపించిన మోడీ…

Friday, November 9th, 2018, 02:30:36 PM IST

ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ లో జరిగిన బహిరంగ సభ లో మోడీ అర్బన్ నక్సల్స్ మీద చాల ఆగ్రహంగా నిప్పుల వర్షం కురిపించాడు. మోడీ మాట్లాడుతూ ‘సబ్ కా వికాస్, సబ్ కా సాథ్’ తమ నినాదమని అన్నారు. అర్బన్ నక్సల్, వారికి మద్దతిస్తున్న విపక్షాలపై ప్రధానంగా విరుచుకుపడ్డారు. పేదలు, గిరిజనులను రాష్ట్రంలోని అర్బన్ నక్సల్స్‌ దోపిడీ చేస్తున్నారని, అలాంటి అర్బన్ నక్సల్స్‌కు విపక్షాలు మద్దతిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా అర్బన్ నక్సల్స్‌కు కాంగ్రెస్ గట్టిగా మద్దతు ఇస్తుందని, ఇది క్షమించరాని నేరం అని అన్నారు. మావోయిస్టుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని చెబుతూనే, మరోవైపు అర్బన్ మావోయిస్టులకు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ పార్టీకి బస్తర్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు.

అర్బన్ నక్సల్స్ ఎసీల్లో ఉంటూ, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ తమ పిల్లలను విదేశాల్లో చిదివిస్తూ, రిమోట్ కంట్రోల్ ద్వారా పేద ఆదివాసీ యువకుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఛత్తీస్‌గఢ్‌‌లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అభివృద్ధి ప్లాన్‌ను అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆటంకాలు కల్పించిదని ఆరోపించారు. అయితే కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులు తీయించామని, దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఛత్తీస్‌గఢ్‌ను నిలిపేందుకు పట్టుదలగా కృషి చేస్తోందన్నారు. రైలు, రోడ్ల అనుసంధానం కోసం తామిచ్చిన హామీలను కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేవలం కుటుంబ పార్టీ అని, బీజేపీ పేదల పక్షమని, ఆదివాసీలను కాంగ్రెస్ ఇంకెంతమాత్రం తప్పుదారి పట్టించలేదని బహిరంగ సభలో మోదీ అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments