క‌న్నా.. 2018 బెస్ట్ పొలిటిక‌ల్ జోక్!

Thursday, September 20th, 2018, 02:56:06 PM IST

ఏపీలో ఒక్కో రాజ‌కీయ నాయ‌కుడు ఒక్కో ర‌కం జోక్ పేల్చుతూ ప్ర‌జ‌ల‌కు వినోదం పంచుతున్నారు. అస‌లు ఈరోజుల్లో రైతుల్ని ప‌ట్టించుకునే ప్ర‌భుత్వాలు ఉన్నాయా? అది కేంద్ర ప్ర‌భుత్వం అయినా లేదా రాష్ట్ర ప్ర‌భుత్వం అయినా? నేటి రైతు దుస్థితికి, ధైన్యానికి, ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం ప్ర‌భుత్వాల దివాళాకోరు త‌నం కాద‌ని అన‌గ‌ల‌మా? కానీ ఈయ‌నేంటో అతి పెద్ద జోక్ పేల్చారు.

గ‌త నాలుగేళ్లుగా పాల‌న‌లో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రైతుల్ని గాలికి వ‌దిలేసి రాజ‌ధాని నిర్మాణం పేరుతో రియ‌ల్ వెంచ‌ర్ల వ్యాపారంలో ఎంత బిజీగా ఉందో రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు తెలుసు. ఇక కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ఇన్నాళ్లు ఏపీలో ఏం జ‌రుగుతున్నా చూస్తూనే ఊరుకుంది. బాబుతో దోస్తీ క‌టీఫ్ అయ్యాక మండిప‌డుతోంది కానీ, ఏనాడైనా భాజ‌పా వాళ్లు ఏపీ రైతు దుస్థితి గురించి మాట్లాడారా? అటు కేంద్రంలోని వాళ్లు కానీ, ఇటు రాష్ట్రంలోని భాజపా నాయ‌కులు కానీ అస‌లు రైత‌న్న గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

ఇలాంటి వేళ ఏపీ భాజ‌పా నాయ‌కుడు కన్నాలక్ష్మీనారాయణ కామెంట్స్ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కొచ్చాయి. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ ప్రభుత్వం లక్ష్యం .. నేడు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల‌తోనే! ఇందులో ఒక్క రూపాయి కూడ రాష్ట్ర ప్రభుత్వానిది లేదు… అంటూ క‌న్నా బొంకారు. నిజానికి ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల్ని ప‌ట్టించుకోలేదు. అటు కేంద్రం అయితే స‌సేమిరా. అస‌లు ఏపీ అభివృద్ధికి, నీటి వ‌న‌రుల‌కు కార‌ణ‌మ‌య్యే కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టునే ప‌క్క‌న పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ ప్ర‌జ‌ల్ని, రైతుల్ని ఉద్ధ‌రిస్తోందిట‌. ఇది క‌న్నా పేల్చిన అతి పెద్ద జోక్‌. ఆయ‌నింకా ఏమ‌న్నారంటే..! “రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కొడుకులను గ్రామీణ, ఐటి శాఖ మంత్రులు గా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ నిధుల్ని దారిమళ్ళించి అవినీతికి పాల్పడుతున్నారు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పది సంవత్సరాలు ప్రతి పక్షనాయకుడుగా పనిచేసినచంద్రబాబునాయుడు తన అనుభావాన్నంతా ఉపయోగించి ఈ నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు“ అంటూ ఓ క‌ఠోర స‌త్యాన్ని క‌న్నా చెప్పారు. రాజ్యాంగ బద్దంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత చంద్రబాబుకు లేద‌ని అన్నారు. అయితే క‌న్నా అన్న ఈ మాట‌ల్లో ప‌క్కాగా నిజం ఉంది. అయితే రైతుల గురించి ఆయ‌న అన్న మాట మాత్రం 2018 బెస్ట్ పొలిటిక‌ల్ జోక్ అని భావించ‌వచ్చు.