మరోసారి ఏపీకి దెబ్బేసిన మోడీ !

Tuesday, October 9th, 2018, 10:54:44 AM IST

2014 ఎన్నికల ఫలితాల తర్వాత నుండి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ స్థాయిలో వివక్ష చూపుతుందో తెలుస్తూనే ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తూ వచ్చిన మోడీ మరోసారి దెబ్బేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.450 కోట్ల నిధుల్ని విడుదలచేస్తున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించింది.

సెక్షన్ 94(2) ప్రకారం తెలంగాణతో పాటు ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లను ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేదు. గతంలో 2017-18 ఆర్ధిక సంవత్సరంలో కూడ రూ.350 కోట్లను విడుదలచేసినట్టే చేసి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన యూసీల్లో స్పష్టత లేదని వెనక్కి తీసుకుంది. అన్నీ సరిగ్గానే సమర్పించామని, కావాలంటే చర్చలకు రావాలని ఏపీ మంత్రులు లోక్ సభలో సవాల్ చేసినా పట్టించుకోలేదు. ఇలా గత ఏడాది, ఈ ఏడాది మొత్తం కలిపి రూ.700 కోట్లు మోడీ ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సి ఉంది.

దోస్తీలో ఉన్న మూడేళ్లు రూ.1050 కోట్లు ఇచ్చి ఆ దోస్తీ కట్ అయ్యాక ఇలా అవకాశం ఉన్న ప్రతిచోట మోడీ ఆంధ్రాపై కక్ష సాధింపుకు దిగడం నిజంగా అమానుషం. ఇలాంటి పాలన ఏ విధంగా పక్షపాతం లేని పారదర్శక పాలన అవుతుందో ఆయనే చెప్పాలి.