పటేల్ విగ్రహం కింద నలిగిపోయిన వారి మాటేమిటి మోడీ !

Wednesday, October 31st, 2018, 08:31:07 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ ఉక్కు సంకల్పంతో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఈరోజు ఘనంగా ఆవిష్కృతం కానుంది. గుజరాత్ లోని కేవడియాలో 182 మీటర్ల ఎత్తులో ఈ విగ్రహం నిర్మితమైంది. సుమారు 3000 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ విగ్రహం సమైక్యతా సారథికి వల్లభాయ్ పటేల్ కు ఘనమైన నివాళి అవుతుందని దేశమంతా భావిస్తుండగా ఆ విగ్రహం కిందపడి తమ బ్రతుకులు నలిగిపోయాయని గిరిజనులు వాపోతున్నారు.

ఈ విగ్రహ నిర్మాణం కోసం సుమారు 72 గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. దీంతో దశాబ్దాలుగా ఉంటున్న నివాసాన్ని, ఉపాధిని కోల్పోయారు చాలా మంది గిరిజనులు. నష్టపోయిన గిరిజనుల్లో ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్టే ఉపాదినిస్తుందని అధికారులు చెబుతున్నా గిరిజనుల్లో ఆ నమ్మకం కనిపించడంలేదు. గతంలో ఇలానే అనేక ప్రాజెక్టుల కోసం సర్వాన్ని త్యాగం చేసిన ఎంతో మంది ఇప్పటికీ సంపూర్ణ సహాయం అందక కష్టాలు పడుతున్నారని, వారిలానే తమని కూడ కొన్నాళ్ల తర్వాత అందరూ మర్చిపోతారని ఆందోళన చెందుతున్నారు.

మరి నెహ్రు, గాంధీలకు సమానంగా వల్లభాయ్ పటేల్ కు ఘనత దక్కాలనే పంతంతో వేలాది కోట్లు వెచ్చించి ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించిన మోదీ గిరిజనులకు న్యాయం చేసే ఉద్దేశ్యం ఉందో లేదో మరి.

  •  
  •  
  •  
  •  

Comments