‘మోడీ – ది ఇంటర్నేషనల్ బ్రాండ్’..మరి లోకల్ గా..?

Friday, November 11th, 2016, 12:02:58 PM IST

modi
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖ్యాతి రోజురోజుకూ పెరుగుతోనే ఉంది. వరుస విదేశీ పర్యటనలు..విదేశాల్లోని చట్ట సభలలో మరియు బయట అదిరిపోయో ప్రసంగాలు..ప్రభుత్వ పతకాలు వాటి ప్రమోషన్స్ .. ఇక ఇటీవల పాక్ పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ..ఇప్పుడు తాజాగా 500, 1000 నోట్లను చిత్తు కాగితాలుగా మార్చిన వైనం.. ఇలా అన్నింటా సంచలన నిర్ణయాలతో మోడీ దూసుకుపోతున్నారు.దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా మోడీ హాట్ టాపిక్ గా మారారు. సర్జికల్ స్ట్రైక్స్ , పెద్ద నోట్ల బ్యాన్ విషయం లో ప్రకటన వెలువడే వరకు ఎలాంటి లీక్ లు కూడా రాలేదు. ఇలా తాను అనుకున్న ఆలోచనలను పక్కాగా అమలు చేయడం లో మోడీ వంద శాతం విజయం సాధించారు.

అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కూడా తన విజయానికి మోడీని వాడుకోకుండా ఉండలేకపోయాడు.మోడీ తరహాలో ‘ఆప్ కి బార్ ట్రంప్ సర్కార్’ అంటూ హిందీ లో ప్రకటన చేసి భారతీయులను ఆకర్షించాడు.మోడీ ప్రతి ఒక్క నిర్ణయం తన ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచేలా ఉంది.మోడీ నిర్ణయాలతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిలబడలేక పోతోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మోడీ ముందు నిలువలేక పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకాకాగా రాహుల్ కు భావి భారత ప్రధాని అంటూ నామకరణం కూడా చేసేసింది.రాహుల్ కు బిరుదైతే త్వరగా వచ్చింది కానీ.. ఆ స్థాయికి మాత్రం రాహుల్ ఇంకా మైళ్ళ దూరంలో ఉండిపోయాడని విశ్లేషకులు అంటున్నారు.

మోడీ తీసుకున్న నిర్ణయాలు స్వతంత్ర భారతం లో ఏ ప్రధాని తీసుకోలేదన్నది ఒప్పుకుని తీరాల్సిన నిజం.ఇంతటి ఖ్యాతిని పొందిన మోడీ దేశ రాజకీయాల్లో బిజెపి వృద్ధికోసం సాధారణ రాజకీయ నాయకుడు వేసే ఎత్తుగడలు వేయాల్సిన అవసరం లేదు.కానీ దక్షిణ భారత దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు నానా పాట్లు పడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారా అనే అనుమానం కలగక మానదు.ప్రపంచ వ్యాప్తంగా మోడీ ఎంతటి ఖ్యాతిని సంపాదించినా సీమాంధ్ర లో మాత్రం ఆ ప్రభావం లేదు దీనికి కారణం ప్రాంతీయ పార్టీల హవా ఒకటి అయితే, మరోకారణం మోడీ వాగ్దాన భంగం చేయడమే. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయం లో మోడీ ప్రభుత్వం మాట తప్పింది. పైగా ఏపీకి నిధుల విషయంలో కూడా పక్షపాత ధోరణి చూపిస్తోంది.ఏపీకి నిధులు ఇస్తే బిజెపికి రావలసిన ఖ్యాతి తెలుగుదేశం పార్టీ కి వెళ్ళిపోతుందని, దానికోసమే బిజెపి సీమాంధ్ర పై పక్ష పాతం చూపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కు రావలసిన నిధులతోనే జాప్యం చేస్తోందన్నది వాస్తవం. అంతర్జాతీయంగా మోడీ ఎంతటి ఖ్యాతిని పొందినా స్థానికంగా కొన్ని రాష్ట్రాలకు తగిన స్థాయిలో సాయం చేయడంలో మోడీ విఫలమైనారు.సర్జికల్ స్ట్రైక్స్,, పెద్ద నోట్లపై బ్యాన్ వంటి సంచలన నిర్ణయాలతో సమానంగా రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ కు సాయం అందించడం లో ఓ నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం లో మోడీ దృష్టి సారించకపోతే మోడీ ఎంతటి ఖ్యాతి పొందినా బీజీపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బిజెపి బలపడడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు.