కనీసం మా రాజీనామా అయినా స్వీకరిస్తారా..మోదీ జీ..?

Thursday, March 8th, 2018, 04:40:35 PM IST

గత కొద్దికాలంగా బీజేపీ పాలన మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మోదీ మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేయడానికి సిద్దపడ్డారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సుజనా చౌదరి, అశోక్‌గజపతిరాజు తమ రాజీనామా లేఖల్ని భారత ప్రధాని మోదీ కి సమర్పించడానికి సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన వారిద్దరూ మరికాసేపట్లో ఆయనను కలిసి తమ రాజీనామాలు అప్పగించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ఉదయం సుజనా చౌదరి, అశోక్‌గజపతి రాజు ఇద్దరూ రాజీనామా చేసేందుకు సిద్ధపడి తమ నివాసస్థలం నుంచి పార్లమెంట్‌కు రాజీనామా లేఖలతో చేరుకున్నారు. ఐదు నిమిషాలపాటు ప్రధానిని సమయం కోరి తమ రాజీనామా లేఖలు సమర్పించేందుకు సంసిద్ధులయ్యారు. అయితే, ప్రధాని ఈ ఉదయం భేటీ బచావో – భేటీ పడావో కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజస్థాన్‌కు వెళ్లడంతో ఈ సాయంత్రం 4.30 గంటలకు ఆయన దిల్లీకి వచ్చాక కలిసే అవకాశం ఉంది. ప్రధానిని కలిసి తాము రాజీనామా చేసేందుకు కారణమేంటి? ఎందుకు చేయాల్సి వచ్చిందనే వివరాలతో పాటు చంద్రబాబు ఇచ్చిన సందేశాన్ని కూడా ప్రధానికి వివరించనున్నారు. మరి ఈ మంత్రులు చెప్పే అంశాలు విన్నాక అయినా మోదీ నిర్ణయం మార్చుకొని ఇచ్చిన హామీలను, ప్రత్యెక హోదాను కల్పిస్తాడో లేదో చూడాలి.

టీడీపీ మంత్రుల నిరసన యుద్ధం:
ఇదిలా ఉండగా పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ మంత్రుల హామీలను నెరవేర్చడానికి చేస్తున్నఆందోళన ఇంకా కొనసాగుతోంది. గురువారం టీడీపీ సభ్యులు టీషర్టులు ధరించి నిరసన చేపట్టారు. ప్రధానమైన ఆరు డిమాండ్లతో పాటు సేవ్‌ ఏపీ టీషర్ట్‌లతో సభ లోపలా, బయటా దద్దరిల్లేలా నిరసన తెలిపారు. కేంద్రం ఏమేం హామీలు ఇచ్చింది. ఇంకా రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వలేదు? ఇంకా ఎంతమేరకు నిధులివ్వాలనే అంశాలను అవకాశం వచ్చిన ప్రతిచోటా వ్యక్తంచేస్తున్నారు. మరింత ఉద్ధృతంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏపీకి జరిగిన నష్టాన్ని దేశ ప్రజలకు తెలిపేందుకు తెదేపా ఎంపీలంతా సిద్ధమై ఉన్నారు. ఇవాళ్ళ జరగబోతున్న ఈ ఇద్దరు మంత్రుల రాజీనామా టీడీపీని ఎక్కడివరకు తీసుకు వెళ్తుందో చూడాలి.