మోదీ నోట్ల రద్దు రియాక్షన్ ఇప్పుడు చూపిస్తుందా..? అందుకే బ్యాంకుల్లో డబ్బులు లేవా..?

Thursday, April 26th, 2018, 02:35:00 PM IST

చాలా రోజులుగా ఏటీఎంలలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూలేనంత నగదు కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. తగినంత డబ్బు సరఫరా చేస్తున్నామని ఆర్బీఐ చెబుతున్నా.. గ్రౌండ్ లెవల్లో పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. బ్యాంకుల్లోనే నగదు లేకుండా పోతున్నది. దీంతో ప్రింటింగ్ ప్రెస్‌లలో నోట్ల ముద్రణను భారీగా పెంచేసింది ఆర్బీఐ. ఇదిలా ఉంటే అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన డేటా ఆసక్తికర విషయాలను బయట పెట్టింది. బ్యాంకుల్లో ప్రజలు విత్‌డ్రా చేసుకుంటున్న సొమ్ముకు, ఖర్చు చేస్తున్న మొత్తానికి అసలు సంబంధమే లేదని ఈ డేటావివరణ ఇచ్చింది. అంటే భారతీయులు మళ్ళీ తమ పాత పద్ధతికి అలవాటు పడిపోతున్నారు. నగదు బ్యాంకుల నుంచి తెచ్చుకోవడం, వాటిని మళ్లీ సర్క్యులేట్ చేయకుండా తమ దగ్గరే పెట్టుకుంటుండటంతో ఇప్పుడీ సమస్య తలెత్తిందని తాజాగా విడుదల అయిన డేటా స్పష్టంచేసింది. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసిన సొమ్ము మళ్లీ మార్కెట్‌లోకి రావడానికి కొన్ని నెలల సమయం పడుతున్నదని ఆర్థికవేత్తలు వెల్లడించారు. ప్రతివారం బ్యాంకుల నుంచి విత్‌డ్రా అవుతున్న సొమ్ము, ఆర్బీఐ కొత్తగా బ్యాంకులకు సరఫరా చేస్తున్న మొత్తాన్ని పరిశీలిస్తే కరెన్సీ వాడకం ఎంతలా పెరిగిపోయిందో అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఏప్రిల్ 20కి ముందు వారం బ్యాంకుల నుంచి 16340 కోట్లు విత్‌డ్రా చేశారు. దీంతో ఏప్రిల్ మూడు వారాలు కలిపి మొత్తం విత్‌డ్రా చేసిన మొత్తం రూ.59520 కోట్లకు చేరింది. అంతకుముందు మూడు వారాలు ఇది కేవలం రూ.16470 కోట్లుగానే ఉంది. ఇక జనవరి, మార్చి త్రైమాసికంలో మొత్తం విత్‌డ్రావల్స్ రూ.1.4 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ డేటా చెబుతున్నది. 2016లో ఇదే త్రైమాసికంలో జరిగిన విత్‌డ్రావల్స్ కంటే ఇది 27 శాతం ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్‌లో మొత్తం నగదు రూ.18.9 లక్షల కోట్లుగా ఉంది. ఆరు నెలలుగా ఈ సమస్య పెద్దగా తెలియకపోయినా.. గత నెల నుంచి తెలంగాణతోపాలు పలు రాష్ర్టాల్లో ఖాళీ ఏటీఎంలు దర్శనమివ్వడంతో సమస్య తీవ్రత తెలిసొచ్చింది. దీనికి కచ్చితమైన కారణాన్ని ఆర్బీఐ బయటికి చెప్పకపోనా కూడా.. ఒక్కటి మాత్రం స్పష్టమవుతున్నది. నరేంద్ర మోదీ నోట్ల రద్దు దెబ్బకు ఇండియన్స్ మళ్లీ పాత పద్ధతికి అలవాటు పడ్డారు. డబ్బును బ్యాంకులకు, పన్ను అధికారులకు దూరంగా ఇళ్లలో పోగేసి దాచి పెట్టుకుంటున్నారు. నోట్ల రద్దుకు చాలా ఆలస్యంగా వచ్చిన రియాక్షన్ ఇది. ఇళ్లలో నగదు పోగేసుకోవడానికి పలు కారణాలను ఆర్థికవేత్తలు చెబుతున్నారు. భారత బ్యాంకుల పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం, జీఎస్టీని ఎగ్గొట్టడం, ఎన్నికల ప్రచారంలో ఖర్చు చేయడానికి, రైతులు పంటలు వేయడానికి భారీ మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments