అగ్రవర్ణ పేదలకు 10 % రిజర్వేషన్లు.. నిజమైతే బాగుణ్ణు !

Tuesday, January 8th, 2019, 12:19:39 PM IST

నిన్న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. దీని ద్వారా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమించిన కమీషన్ 2010లో సమర్పించిన నివేదిక ప్రకారం అగ్రవర్ణ పేదల సంఖ్య 6 కోట్లని తేలింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో అది ఇంకొంత పెరిగి ఉండొచ్చు.

ఈ రిజర్వేషన్ అమలు జరగాలంటే సుప్రీం కోర్టు నిబంధనలు ప్రకారం ప్రస్తుతం ఉన్న 49.5 శాతం రిజర్వేషన్లను 59.5 శాతానికి పెంచాల్సి ఉంటుంది. ఈ పెంపుకు రాజ్యాంగంలోని 15, 16వ అధికరణలను సవరించాల్సి ఉంటుంది. ఈ సవరణకు అవసరమైన బిల్లును ఈరోజే సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక సభలోని విపక్షాలకు ఈ బిల్లుతో చిక్కొచ్చి పడింది. ఈ బిల్లును గనుక ఆమోదిస్తే అగ్రవర్ణాల్లో మోడీ ప్రభ ఇంకా పెరుగుతుంది. ఒకవేళ ఆమోదించకపోతే అదే అగ్రవర్ణాలు తమకు దూరమవుతాయి. కాబట్టి సభలో బిల్లు పాసవడానికే అవకాశాలు ఎక్కువున్నాయి.

ఎన్నికల ముందు మోడీ ఇలాంటి రిజర్వేషన్ అస్త్రాన్ని బయటకి తీయడంతో అయోమయంలో పడిన విపక్షాలు రిజర్వేషన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే ఇది అధికారం కోసం మోడీ వేసిన ఎత్తుగడని, ఎన్నికల తర్వాత చాలా హామీల్లాగానే దీన్ని కూడ పక్కనపెట్టేస్తారని, అసలు రిజర్వేషన్ అమలు ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వారంతా అంటున్నట్టు మోడీ ఈ హామీని కేవలం ఎన్నికల ప్రయోజనం కోసం వాడుకోకుండా రిజర్వేషన్ అమలును నిజం చేసి చూపిస్తే ఎన్నాళ్లగానో ఆర్ధిక వెనుకబాటుతో అన్ని విధాలా నలిగిపోయిన అగ్రవర్ణ పేదలకు మంచి చేసినవారవుతారు.