చివరి భేటీ.. మోడీ కొత్త వరాలు !

Thursday, March 7th, 2019, 10:14:40 AM IST

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మోడీ ప్రజల్ని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులపై ప్రతిదాడుల అంశంతో కొంచెం పుంజుకున్న ఆయన అంతకు ముందే బడ్జెట్లో ప్రకటించిన పన్ను పరిమితిని పెంచడం, గృహ నిర్మాణాలపై జీఎస్టీ తగ్గించడం వంటి అంశాలతో మధ్యతరగతిలో కొంచెం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సంపాదించుకున్నారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పెద్దగా పేరు తేలేదు.

అందుకే ఈరోజు చివరిగా జరగనున్న కేబినెట్ భేటీలో ఇంకొన్ని సంక్షేమ పథకాల్ని ఫైనాన్ల్ చేస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటాకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఇక నోట్ల రద్దు, జిఎస్టీతో విసిగిపోయిన మధ్యతరగతి, చిన్న వ్యాపారులను ఆకర్షించేందుకు పథకాలు ప్రకటించవచ్చు. అంతేకాదు యువతలో కూడా మద్దతు సంపాదించుకునేందుకు కొత్త పథకాల్ని రచిస్తారట.

ఇలా రూపొందించిన పథకాల్ని ఎన్నికల కమీషన్ ఎలక్షన్ తేదీలను ప్రకటించేలోగా జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మోడీ ఎలాంటి పథకాలు ప్రకటిస్తారు, వాటిపై ఎలా రియాక్ట్ అవ్వాలి అనే చర్చల్లో తలమునకలై ఉన్నాయి.