మోడీ ఆర్ధిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు : చిదంబరం

Monday, June 4th, 2018, 11:44:51 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పదవి కాలం నాలుగేళ్లు ముగిసి ఐదవ సంవత్సరం వస్తున్నా ఇప్పటికీ బీజేపీ ప్రజలకు సరైన న్యాయం చేయలేదని మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అన్నారు. నిన్న మహారాష్ట్ర థానేలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని మోడీ ప్రభుత్వం పై ఆయన ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాల వల్ల ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థ అనే కారుకి వున్న నాలుగు చక్రాలలో దాదాపుగా మూడు చక్రాలకు తూట్లు పొడిచి కేవలం ఒకే చక్రంపై నడిపిస్తున్నారని అన్నారు. ఒక కారుకి ఒకటి లేక రెండు చక్రాలు ఇబ్బంది కలిగితే ఎలాగో మెల్లగా నడిపించవచ్చని, అదే మూడు చక్రాలు పాడయితే ఇక ఆ కారు నడవడం కుదరదని అన్నారు. మన అర్దిక వ్యవస్థలో ఎగుమతులు, ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం, ప్రభుత్వ వ్యయాలు అనేవి నాలుగు చక్రాలు అని ఆయన అన్నారు.

అలానే మోడీ ఎంతో గొప్పగా చెప్పుకునే ముద్ర యోజన పధకం కింద సగటు మనిషికి కేవలం రూ.45,000లకు మించి ఇవ్వడం లేదని, వాటితో పకోడీ బండి పెట్టుకోవడం తప్ప మరేమి కుదరదని ఛలోక్తులు విసిరారు. కాగా వస్తువుల ఎగుమతి విషయంలో తమ యుపిఎ హయాంలో 315బిలియన్ డాలర్లు ఉంటే, గత సంవత్సరం 303బిలియన్ డాలర్లు మాత్రమే జరిగాయని, అంతేకాక అంతకముందు సంవత్సరాలు అయితే మరింత దారుణమని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ పై ధరల పెంపు వల్ల సామాన్యుడి పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అన్నారు. వాటి పెంపుతో వేలకోట్లు దండుకుని వాటిని తిరిగి ప్రజా సంక్షేమం కోసం సక్రమంగా వినియోగించడంలేదని ఆరోపించారు. కొన్ని రంగాల్లో పెట్టుబడులు లేనేలేవని, ముఖ్యంగా ఇటీవల అయితే విద్యుత్ రంగంలో పెట్టుబడులు అసలు లేనే లేవని అన్నారు. మోడీ చేసే ఈ నిరంకుశ పాలనా వల్ల ఆర్ధిక వ్యవస్థతోపాటు అంతకు మించి సామజిక వ్యవస్థకు పూర్తిగా నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇకనైనా మేలుకుని ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సక్రమమైన పాలన పై దృష్టిపెట్టాలని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments