మోడీ సవాల్ ను స్వీకరించిన కమల్

Saturday, October 4th, 2014, 03:30:14 AM IST


భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్చా భారత్ కార్యక్రమం సర్వత్రా ప్రశంశలు అందుకుంటోంది. ఇక ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ తొమ్మిది మంది ప్రముఖులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఒకరైన ప్రముఖ బహుభాషా నటుడు కమల్ హాసన్ ప్రధాని సవాల్ ను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలో మాట్లాడుతూ ‘స్వచ్చా భారత్’ లో ప్రధాని మోడీ తనని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పారిశుద్ధ్యంపై తాను, తన అభిమానులు 20 ఏళ్ళుగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

ఇక కమల్ ఇంకా మాట్లాడుతూ ‘స్వచ్ఛ భారత్’ ప్రజల పని అని స్పష్టం చేశారు. అలాగే తాను కూడా అందులో భాగమేనని తెలిపిన కమల్ హాసన్ దీనిని రాజకీయాలకు వాడుకోవద్దని సూచించారు. ఇక తనకు ప్రధాని మోడీ సవాల్ చేస్తే తాను 90లక్షల మంది భారతీయులను సవాల్ చేస్తున్నాని, అందరూ ఈ స్వచ్చా భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా తన అభిమానులు ఇందులో పాలు పంచుకోవాలని కమల్ హాసన్ విజ్ఞ్యప్తి చేశారు.