జమ్మూ కాశ్మీర్ జట్టు కోచ్‌గా అజరుద్దీన్?

Saturday, August 17th, 2013, 05:12:22 PM IST

mohammad-azharuddin-kashmir

హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలని అజర్‌కు విజ్ఝప్తి అందింది. దీనిపై అజరుద్దీన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బిషన్ సింగ్ బేడీ కాలపరిమితి ముగియడంతో కోచ్ పదవి ఖాళీగా ఉందని చెబుతూ కోచ్‌గా రావాలని జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అజర్‌ను కోరారు. అయితే తుది నిర్ణయం జరగలేదని అబ్దుల్లా ఇఎస్‌పిఎన్ క్రిక్ ఇన్ఫోకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అజరుద్దీన్‌పై బిసిసిఐ విధించిన జీవితం కాలం నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరుడు ఎత్తేసింది. అజరుద్దీన్ ఇంకా ఈ విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన కార్యదర్శి ముజీబ్ ఖాన్ చెప్పారు. ఏ విధమైన సేవలనైనా అజరుద్దీన్ నుంచి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘం తెలిపిందని, క్రికెట్‌పై గల ఎనలేని అభిమానం కారణంగా ఆ క్రీడకు ఏదైనా చేయాలని అజర్ తపిస్తున్నారని ఆయన చెప్పారు.