వీడియో : శ్రీకాళహస్తి లేదా వెంకటగిరి..వైసిపి తరుపున మోహన్ బాబు పోటీ..?

Thursday, February 1st, 2018, 05:25:14 PM IST

డైలాగ్ కింగ్ మోహన్ బాబు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. 2019 ఎన్నికల్లో తన మనసులో ఉన్న పార్టీ తరుపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయని టివి 9 తో జరిగిన ముఖా ముఖి కార్యక్రమంలో మోహన్ బాబు వెల్లడించారు. కానీ తన మనసులో ఏ పార్టీ ఉంది అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. మోహన్ బాబు వైసిపి తరుపున శ్రీకాళహస్తి లేదా వెంకటగిరి నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ విషయాన్ని సుతిమెత్తగా ఖండించి మోహన్ బాబు తన మనసులో ఏపార్టీ ఉందొ ఇప్పుడే బయటపెట్టనని అన్నారు.

ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలా ఉండగా అటు వైసిపి, ఇటు టీడీపీ కార్యకర్తల్లో కూడా మోహన్ బాబు గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైపోయింది.టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోహన్ బాబు చంద్రబాబుతో రాసుకుపూసుకు తిరుగుతున్నారని, ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయం అని వార్తలు వస్తున్నాయి. వైసిపి శ్రేణులు కూడా మోహన్ బాబు తమ పార్టీలోకే వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరి మరియు శ్రీకాళహస్తి లతో మోహన్ బాబుకు విడదీయరాని అనుభందం ఉంది. మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని వెంకటగిరి మరియు శ్రీకాళహస్తి లలోనే చిత్రీకరించారు. దీనితో ఈ నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తే స్థానికుడే అనే భావన ప్రజల్లో ఉంటుందనేది మోహన్ బాబు ఫీలింగ్ అయి ఉండవచ్చు. మరి ఈ డైలాగ్ కింగ్ నోటి నుంచి పొలిటికల్ డైలాగ్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి..!