మోహ‌న్‌బాబు ఆవేద‌న : ఈ హ‌త్య‌లు ఎవ‌రు చేస్తున్నారు..? ఎందుకు చేయిస్తున్నారు..?

Saturday, March 16th, 2019, 12:06:29 AM IST

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును నిస్ప‌క్ష‌పాతంగా ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని సినీ న‌టుడు మోహ‌న్‌బాబు కోరారు. అజాత శ‌త్రువును చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హంత‌కుల‌ను త్వ‌ర‌గా ప‌ట్టుకోవాల‌ని పోలీసుల‌ను కోరారు. కాగా, వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యం తెలుసుకున్న మోహ‌న్‌బాబు పులివెందుల‌లో ఆయ‌న మృత‌దేహానికి నివాళులర్పించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఏం జ‌రుగుతుంది..? ఈ అరాచ‌కాలు ఏంటి..? ఘోరాలు ఏంటి..? ఎవ‌రు చేస్తున్నారు..? ఎవ‌రు చేయిస్తున్నారు..? ఎందుకు చేయిస్తున్నారు.? భ‌గ‌వంతుడు, ప్ర‌కృతి చూస్తోంది. ప్ర‌కృతి ఎవ‌ర్నీ విడిచిపెట్ట‌దు. చాలా మంది వేరే పార్టీలో ఉన్న వాళ్లు కూడా వివేకానంద‌రెడ్డి అంద‌రికీ అజాత శ‌త్రువు, ధ‌ర్మ‌రాజులాంటి వారు అంటూ కొనియాడుతున్నారు.

అటువంటి వ్య‌క్తి ఇత‌రుల‌కు హాని త‌ల‌పెట్ట‌డు. ప‌ది మందికి స‌హాయం చేసే వ్య‌క్తి మ‌న‌సున్న వ్య‌క్తి అంటూ చాలా మంది వివేకానంద‌రెడ్డి గురించి చెప్తుంటే చెప్తుంటే తాను ఆశ్చ‌ర్య పోయాన‌న్నారు. వైఎస్ వివేకానంద‌రెడ్డిప‌ట్ల అత్యంత క్రూరంగా వ్య‌వ‌హ‌రించిన ఆ రాక్ష‌సుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని పోలీసులు శాఖ‌ను వేడుకుంటున్న‌ట్లు మోహ‌న్ బాబు తెలిపారు.