ఇక కృష్ణా నదిపై మూన్ లైట్ డిన్నర్

Monday, September 29th, 2014, 11:44:45 AM IST

chandrababu-and-The-Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పర్యాటకరంగంలో అభివృద్ధి చేస్తానని ప్రకటించినప్పటి నుండి ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంగా విజయవాడలో పర్యాటకులను ఆకర్షించేందుకు కృష్ణా నదిపై మూన్ లైట్ డిన్నర్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నప్పటికీ త్వరలో అది నిజం కాబోతోంది. ఇక దీనిపై చంద్రబాబు ఇప్పటికే కృష్ణా నదిపై బోటు కదులుతుండగా మూన్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి అతి త్వరగా తీసుకురావాలని ఏపీ టూరిజం అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

కాగా మొదట భవానీ ఐలాండ్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెయ్యడానికి ఈ ప్లాన్ ను రూపకల్పన చేసినప్పటికీ టూరిజం డిపార్టుమెంటు దానిని అమలు చెయ్యడంలో విఫలమైంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని వరల్డ్ క్లాస్ టూరిస్ట్ హబ్ గా మార్చే ప్రయత్నం చేస్తుండడంతో ఈ పధకాన్ని త్వరగా అమలు చేసేలా పర్యాటక రంగం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఏపీ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ చందనా ఖాన్ మాట్లాడుతూ భవానీ ఐలాండ్ ను, కృష్ణా పరివాహక ప్రాంతాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని, నదిపై కదిలే బోటులో మూన్ లైట్ డిన్నర్ పధకంకు విశేష స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.