కన్నబిడ్డల సమక్షంలో తల్లితండ్రుల పెళ్లి!

Thursday, April 12th, 2018, 05:32:10 PM IST

ఏ ఇంట్లో అయినా కొడుకో, లేక కూతురో పెళ్ళీడుకొస్తే, అతడికి పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేయాలని తల్లి తండ్రి ఆశపడటం సహజం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఒక సంఘటన వింటే, మనకు ఆశ్చర్యం వేయక మానదు.12 ఏళ్ల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్న తల్లితండ్రులిద్దరూ పెళ్లి చేసుకున్న ఆసక్తికర సంఘటన సంతగవిరమ్మపేటలో జరిగింది.విజయనగం జిల్లా శృంగవరపు కోట మండలానికి చెందిన నరవ సన్యాసిరావు, కొండమ్మ 13 సంవత్సరాల కిందట ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒకటే అయినా తల్లితండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఏడాది పాటు బయట ఉండి తరువాత స్వగ్రామం చేరుకున్నారు.

అప్పటినుంచీ కలిసే ఉంటున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా రమ్య (12), ఈశ్వరరావు (7) జన్మించారు. ఇటీవల వీరు చిన్న ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశం, సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి నిర్ణయించుకొని ముహూర్తం కోసం గ్రామ పురోహితుని వద్దకు వెళ్లగా దంపతులు కానివారు సత్యనారాయణ వ్రతం, గృహప్రవేశానికి పనికిరారని తేల్చి చెప్పారు. దీంతో తర్జనభర్జన అనంతరం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తల్లితండ్రులకు తమ నిర్ణయం తెలిపారు. బుధవారం ఉదయం గ్రామంలోని రామాలయంలో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం నిర్ణయించారు. తల్లితండ్రులు, కుమార్తె, కుమారుని సాక్షిగా శాస్రోక్తంగా కొండమ్మ మెడలో సన్యాసిరావు తాళి కట్టాడు. ఈ పెళ్లికి గ్రామం అంతా తరలి వచ్చింది. పెద్దలంతా అక్షింతలు వేసి ఆశీర్వదించారు…..