కోట్లు దండుకుంటున్న సినిమా వాళ్ళు హోదా కోసం బయటకి రావాలి!

Sunday, May 13th, 2018, 05:52:00 PM IST

తెలుగు సినీ పరిశ్రమ ఏడాదికి కొన్ని వందల కోట్లు ప్రజలనుండి దండుకుంటుందని, అటువంటిది ప్రజల మంచి కోసం హోదా పోరాటం జరుగుతుంటే సినీ పరిశ్రమ వ్యక్తులు మౌనం వహించడం మంచిది కాదని, నిర్మాత రవిచంద్ అంటున్నారు. నేడు విజయవాడ పున్నమి ఘాట్లో జల దీక్ష చేసిన ఆయన, తెలుగు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా హోదా ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్ వంటి అగ్రనటులు ఉద్యమాన్ని నడిపించాలని, అంతేకాని ఇంట్లో కూర్చుని మౌనం వహించకూడదన్నారు. ఆంధ్రప్రజలు కూడా మనుషులేలని, మనం సంపాదిస్తున్న డబ్బులో ఆంధ్ర థియేటర్ల నుండి రావడంలేదా అని ఆయన ప్రశ్నించారు. అలానే రాజమౌళి, శ్రీను వైట్ల, సురేష్ బాబు, దిల్ రాజు వంటి వారు కూడా ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

మన హీరోలకు ప్రజల కష్టాలు పట్టవా? కేవలం, తమ సినిమాలు ఆడించుకుని డబ్బుచేసుకుని వారికుటుంబాల గురించే పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. మన హీరోలకంటే తమిళ హీరోలు నయమని, ఒకప్పుడు జల్లికట్టు కోసం, అలానే కావేరి జలాల వివాదం కోసం తమిళ పరిశ్రమ యావత్తు ఉద్యమాలు చేసిందని, అటువంటివి మన వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాబట్టి ఇప్పటికైనా నిర్మాతలు, హీరోలు, దర్శకులు అందరూ కలిసి పోరాడితే మంచిదన్నారు. నిజానికి వారు విజయవాడకు రావలసిన అవసరం లేదని, కావాలనుకుంటే హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటుచేసుకుని ఏదైనా ఒకరోజు వీలు చూసుకుని మద్దతు ప్రకటించాలన్నారు. సినిమావాళ్లు ఉద్యమిస్తే మంచి ఫోకస్ వస్తుందని, దానివల్ల మన వ్యధ జాతీయ స్థాయివరకు వినిపిస్తుందన్నారు. అలా చేయగలిగితే కేంద్రప్రభుత్వం తప్పక దిగివచ్చి హోదా ఇచ్చితీరుతుందని, కాబట్టి సినీపెద్దలు దయవుంచి ఈ విషయమై త్వరగా ఒకనిర్ణయం తీసుకోవాలన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments