విడిపోయినా సోదరుల్లా కలిసి ఉందాం అన్న మాటను నిజం చేస్తున్న ఎంపీ కవిత

Wednesday, January 25th, 2017, 08:25:17 PM IST

kavitha
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని తెలుగు యువత ఉద్యమానికి సిద్ధమైంది. వారికి తెలుగు సినీ రంగం నుండి చాలా మంది మద్దతు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ లాంటి వాళ్ళు కూడా తెలుగు యువత చేస్తున్న ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా సినీ హీరోలు సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ, తనీష్, నిఖిల్, సందీప్ కిషన్ లాంటి యువ హీరోలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. వీరే కాకుండా తెలంగాణకు చెందిన హీరో సంపూర్ణేష్ బాబు కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అనడం విశేషం.

ఇదిలా ఉంటే… తెరాస ఎంపీ కవిత ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం విశేషం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆంధ్రా ఎంపీలతో కలిసి తాను కూడా పార్లమెంట్ లో పోరాడతానని ఆమె అన్నారు. అలాగే తెలంగాణకు ప్రత్యేక హై కోర్ట్ కోసం ఆంధ్రా ఎంపీలు కూడా తమతో కలిసి పోరాడాలని ఆమె సూచించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కోసం ఉమ్మడి పోరాటానికి సిద్ధమని, తెలుగు ప్రజలు విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని తాము ఆ రోజే చెప్పామని కవిత స్పష్టం చేశారు.