ఒకే ఒక్కడు: ధోనీ అరుదైన రికార్డ్..!

Tuesday, June 25th, 2013, 09:07:53 AM IST


టీమిండియాలో ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీదే హంగామా.. అతణ్ని కొందరు మిస్టర్ కూల్ అంటారు. మరికొందరు సుడిగాడు అంటారు. ఇంకొందరేమో డైనమైట్ అని పిలుస్తారు. ఐతే ఇతడి ఖాతాలో మరో కొత్త బిరుదు వచ్చి చేరింది.. అదే, ఒకే ఒక్కడు..! ఇంటర్నేషనల్ క్రికెట్ లో అద్భుత ఫీట్ సాధించి.. ఒకే ఒక్కడుగా నిలిచాడు.

ధోనీ సారథ్యంలోని జట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల మేజర్ టైటిల్స్ గెలవడమే ఇందుకు కారణం. గతంలో టీ 20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లను గెలిచిన ధోనీ.. ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్ పై గెలిచి మరో ఘనత సాధించాడు. ఐసీసీ నిర్వహించిన అన్ని ఫార్మాట్ల కప్ లను గెలిచిన ఏకైక కెప్టెన్ గా ధోనీ రికార్డు సాధించాడు. ఇంతవరకు ఏ దేశ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.

2007లో జరిగిన టీ 20 వల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించడం ద్వారా ధోనీ తొలి మేజర్ టైటిల్ ను సాధించాడు. భారత కెప్టెన్ గా అప్పుడప్పుడే ఎదుగుతున్న ధోనీకి ఈ విజయం ఎంతగానో ఊపునిచ్చింది. అప్పట్నుంచి టీమిండియా కెప్టెన్ గా ధోనీ విజయాల జైత్రయాత్ర కొనసాగించాడు.

సిక్సర్ కొట్టి ప్రపంచ కప్
ప్రతిష్టాత్మక వన్డే వల్డ్ కప్ సాధించాలన్న భారత అభిమానుల ఆకాంక్ష ధోనీ హయాంలో నెరవేరింది. 2011 వల్డ్ కప్ లో ధోనీ గ్యాంగ్ అద్భుత ఆటతీరు కనబరిచి కప్ ను కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ సిక్సర్ కొట్టి భారత్ కు ప్రపంచకప్ అందించాడు. ఈ దెబ్బకు ధోనీ దశ తిరిగిపోయింది. భారత క్రికెట్ కు బ్రాండ్ గా మారాడు.

ఇక చివరి సారిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోనీ గ్యాంగ్ గెలుచుకుంది. ఈ సిరీస్ లో ఓటమే ఎరుగకుండా…వరుసగా ఆరు విజయాలు సాధించి కప్ ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో ఐసీసీ నిర్వహించే అన్ని ఫార్మాట్లలోనూ కప్ కైవసం చేసుకున్న ఏకైక కెప్టెన్ గా ధోనీ రికార్డు సాధించాడు.

ఎన్నో మైలురాళ్లు..
విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు చేరుతున్నాయి. ఫార్మాట్ ఏదైనా అదరగొడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. వన్డేలే కాక టెస్టుల్లోనూ ధోనీ మార్క్ కనిపిస్తోంది. 2009లో టీమిండియాను టెస్ట్ నెంబర్ వన్ ర్యాంక్ లో నిలబెట్టిన ధోనీ.. రీసెంట్ గా భారత గడ్డపై ఆసీస్ 4-0తో ఓడించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మొత్తానికి మహేంద్ర సింగ్ ధోనీ రోజురోజుకీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇమేజ్ పెంచుకుంటూ ఒకే ఒక్కడు గా తయారయ్యాడు.