చెన్నై ఊపిరి పీల్చుకో..మహేంద్ర సింగ్ ధోని వస్తున్నాడు !

Tuesday, October 24th, 2017, 08:42:47 PM IST

వచ్చే ఏడాది ఐపీఎల్ లో నిషేదిత జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. కాగా టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తదితర ఆరోపణలతో గత రెండు సీజన్లలో చెన్నై, రాజస్థాన్ జట్లు నిషేధం ఎదుర్కొన్నాయి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ తో నిషేధం ముగిసింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఈ రెండు జట్లు తిరిగి మైదానంలో మెరవబోతున్నాయి. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్ల తరుపున ఆడుతున్న సభ్యులని వేలంతో సంబంధం లేకుండా తిరిగి వారి వారి జట్లలో ఆడేవిధంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విధివిధానాలని రూపొందిస్తోంది.

ఇదే కనుక జరిగితే చెన్నై తరుపున ధోని ఆడడం ఖాయం. గవర్నింగ్ కౌన్సిల్ రూపొందిస్తున ఈ ప్లానింగ్ లో ఆయా ప్రాంఛైజీలు అనుమతి మాత్రమే మిగిలి ఉంది. వచ్చే నెలలోనే దీనికి సంబందించిన వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ప్రాంఛైజీలు అంగీకారం తెలిపితే ఒకరు దేశీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్ళని నేరుగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా గుజరాత్, పూణే జట్ల తపుపున ఆడుతున్న ఆటగాళ్లు వేలం లేకుండా తిరిగి పాత జట్లకు ప్రతినిధ్యం వహించే అవకాశం ఉంది. కాగా చెన్నై జట్టుకు కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించిన ధోని అత్యధిక ఐపీఎల్ విజయాల్ని అందుకున్న కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.