అయోధ్యలో మసీదా…ఇక భారత్ పరిస్థితి సిరియానే…

Tuesday, March 6th, 2018, 11:19:30 PM IST

ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరమా, మసీదా అన్న ప్రశ్నలకు ఎన్నో గొడవలు రూపు దిద్దుకున్నాయి. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. అయితే అయోధ్య వివాదం వల్ల భారతదేశానికి మరో సిరియా లాంటి పరిస్థితి వస్తుందేమోనని ఆధ్యాత్మిక గురువు – ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్య చేశారు. ఇక అయోధ్య వివాదంపై ముస్లింలు చేస్తున్న ఆరోపణలను నిజమైతే కచ్చితంగా నిరూపించి చుపాలన్నారు. ఖురాన్ గ్రంథంలో ప్రచురించిన వ్యాక్యాల ప్రకారం అయోధ్య ముస్లింలకు నమ్మకమైన ప్రదేశం కాదని – అలాంటి వివాదాస్పద ప్రదేశంలో అల్లాని కొలివుంచడాన్ని ఇస్లాం ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోదని వివరించారు. కేవలం హిందువులకు పోటీ పడుతూ వారిని గెలవనీయకుండా అడ్డుకోవడమే ముస్లీంల ఆలోచన అని, ముస్లీంలు అయోధ్య జోలికి రావద్దని ఖరాకండిగా తేల్చి చెప్పారు. సిరియా దాడుల విషయంలో అమెరికా – రష్యా దేశాలు కలుగజేసుకున్నట్లే.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం విషయంలోనూ ఇతరులు కల్పించుకుంటున్నారని ఈ పరిణామం ఎంత వరకు దారితీస్తుందో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సిరియా మీద జరుగుతున్న నరమేధం నుంచి ముస్లీంలు కొన్ని మంచి విషయాలు నేర్చుకుని – అయోధ్య వివాదంపై ఆశలు వదులుకుని వెనక్కి తగ్గడమే ఉత్తమమని ఆదేశించారు. జాతీయ మీడియా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశంకర్ ఈ విషయాలు ప్రస్తావించారు. అయోధ్య అనేది ముస్లింలకు సంబంధించిన ప్రాంతం కాదని ముస్లీంసోదరులు గుర్తించాలని, శ్రీరాముడిని అయోధ్యలో కాకుండా వేరే ప్రాంతంలో జన్మించేలా చేయడం అసాధ్యమని.. ఇలాంటి వివాదాస్పద ప్రాంతాన్ని ఇస్లాం ఎప్పటికీ కోరుకోదని అన్నారు. హిందువులు ముస్లీంల పరస్పర ఆమోదంతో రామమందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని వారు ఆ స్థలంలో మసీదు నిర్మించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు ముస్లింలు పూర్తి మద్ధతు తెలపాలని పిలుపునిచ్చారు. లేదంటే భారతావని కుడా సిరియా లాంటి పరిస్థితి తప్పేలా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

రామ మందిరం-బాబ్రీ మసీదు కూల్చిన ప్రాంతంలో అన్ని మతాల వారికి ఉపయోగపడే ఆసుపత్రి లేదా ఇతరత్రా ఏదైనా నిర్మించాలని సలహా ఇచ్చారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ వివాదాన్ని పెంచేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య అంశంలో ప్రతి ఒక్కరూ కోర్టు తీర్పును అంగీకరించే పరిస్థితుల్లో లేరన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్ బీ) బహిష్కృత సభ్యుడు సయ్యద్ సల్మాన్ హుస్సేన్ నద్వీని తాను ప్రలోభపెట్టలేదని వెల్లడించారు. షరియా చట్టం ప్రకారం మసీదును వేరే చోటుకి తరలించడం సాధ్యమేనని నద్వీ గతంలో ప్రకటన చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.