బీసీల్లో కాపు.. ముద్ర‌గ‌డ మ‌రో లేఖాస్త్రం

Wednesday, September 12th, 2018, 03:54:32 AM IST

బీసీల్లో కాపుల్ని క‌లిపేయాల‌ని, వాళ్ల‌కు స‌ముచితంగా రిజ‌ర్వేషన్లు కల్పించాల‌ని కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న ఉద్య‌మాన్ని ఏమాత్రం ప‌ట్టు చిక్క‌కుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అణ‌చి వేస్తున్న వైనం ప‌దే ప‌దే బ‌య‌ట‌ప‌డుతోంది. ఎట్టిప‌రిస్థితిలో ముద్ర‌గ‌డ అడిగింది ఇవ్వ‌రాద‌న్న పంతంతో బాబు పావులు క‌దుపుతున్నారు. ఓవైపు కాపుల్ని బీసీల్లో చేర్చుతామంటూ బొంకుతూనే, తాను చేయాల్సింది చంద్ర‌బాబు చేస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఇదివ‌ర‌కూ ఓ మారు ఉద్య‌మ తీవ్ర‌త పెర‌గ‌కుండా ముద్ర‌గ‌డ‌ను కిర్లంపూడిలోని ఆయ‌న స్వ‌గృహంలోనే బంధించారు. చంద్ర‌బాబు ఆదేశాజ్ఞ‌ల ప్ర‌కారం పోలీసులు చేసిన ర‌చ్చ తెలిసిందే.

ఎవ‌రేం చేసినా మొండివాడైన ముద్ర‌గ‌డ తాను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటూ కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై ఇంకా పోరాడుతూనే ఉన్నారు. త‌న ప్రాణం పోయేవర‌కూ ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాన‌ని అన్నారు. తాజాగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి స్వ‌యంగా ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్లను కల్పించాల‌ని, అసెంబ్లీలో ఆమోదించి పంపిన రిజర్వేషన్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. అలాగే ఆ బిల్లుకు సవరణలు చేసి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ బిల్లు ప్రవేశపెట్టి, గవర్నర్ ఆమోదంతో చట్టం చేయించాలని కోరారు. బిల్లుకు చట్టరూపం వచ్చిన తర్వాత ఓ జీవో ఇచ్చి, తమ జాతికి బీసీ-ఎఫ్ సర్టిఫికెట్లను ఇప్పించాలని సీఎంని డిమాండ్ చేశారు. కేంద్రానికి పంపిన 33/2017 బిల్లులో కొన్ని సవరణలు చేయాలని న్యాయ నిపుణులు చెబుతున్నారని, బాబుకు అభ్యంత‌రం లేక‌పోతే లాయ‌ర్ల‌తో తానే కొత్త బిల్లు త‌యారు చేయిస్తాన‌ని అన్నారు. మునుప‌టి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఈ గొడ‌వ‌ల‌కు శుభం కార్డు చూపించాలని కోరారు. వంక‌లు చూపించి రిజ‌ర్వేష‌న్లు మ‌రువొద్ద‌ని ముద్ర‌గ‌డ అల్టిమేట‌మ్ జారీ చేశారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ముద్ర‌గ‌డ కాపుల రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని సంక‌ల్పించుకున్నార‌ని తాజా లేఖాస్త్రంతో అర్థ‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments