ఇంట్లో మరో పెళ్ళికి రెడీ అవుతున్న అంబానీ ఫ్యామిలీ..

Monday, May 7th, 2018, 10:56:43 AM IST

భారత కుబేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం అయిపోయింది. ముఖేష్ అంబానీ నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ పిరామల్ ఎంటర్ప్రైజెస్ అధినేత అజయ్ పిరామల్ తనయుడు ఆనంద్ పిరమాల్ను వివాహం చేసుకోబోతున్నారు. ఇషా – ఆనంద్ లు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆనంద్ పిరామల్ ఇషాలు మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. మహారాష్ట్ర మహాబలేశ్వర్ లోని ఒక ఆలయంలో ఇషాకు…ఆనంద్ ప్రపోజ్ చేయగా అప్పుడే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇషా అంగీకరించిందని తెలుస్తోంది.

ఇషాతో పాటుగా ఆమె సోదరుడి వివాహం కూడా ఒకేసారి జరగనుందని తెలుస్తోంది. ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతాల వివాహం డిసెంబరులో జరగనుంది. ఇషా ఆనంద్ ల వివాహం కూడా డిసెంబరులోనే జరగనుందని సమాచారం. రెండు వివాహాలు విడివిడిగా జరుగుతాయా? ఒకసారే జరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది. ఇషా ప్రస్తుతం రిలయన్స్ జియో రిలయన్స్ రీటైల్ బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేస్తున్నారు ఇషా. ఇక ఆనంద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ప్రస్తుతం పిరమాల్ ఎంటర్ప్రైజెస్కు ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్గా కొనసాగుతున్నారు.

రిలయన్స్ నుంచి వచ్చిన టెలీకాం విప్లవం జియో వెనుక ఇషా ఉన్న సంగతి తెలిసిందే. తన కలల ప్రాజెక్టు గురించి ముఖేష్ అంబానీ మరింత వివరిస్తూ “2010లో మా అమ్మాయి ఇషా అంబానీ ‘ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంది నాన్నా’ అని చెప్పింది. అప్పుడే దేశ యువత ఆకాంక్షలకు అనువైన సంస్థ ఏర్పాటు చేయాలని ఆలోచించా. అది సాకారం అయ్యేందుకు యువ సారధులు ఎంతో శ్రమించారు’ అని ముకేశ్ అంబానీ వివరించారు.

Comments