దానం, ముఖేష్ .. తేరాస గేమ్‌లో పావులు?

Sunday, September 23rd, 2018, 11:15:47 AM IST

హైద‌రాబాద్‌లో తేరాస‌ పార్టీకి కొర‌క‌రాయి కొయ్య‌గా మారిన న‌గ‌ర కాంగ్రెస్ నేత‌లు దానం నాగేంద‌ర్‌, ముఖేష్ గౌడ్ రాజ‌కీయ భ‌విత‌వ్యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఉద్య‌మ స‌మ‌యంలో అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించి తేరాస‌ కార్య‌క‌ర్త‌ల్ని లాఠీల‌తో త‌రిమి కొట్టిన దానం నాగేంద‌ర్ నాట‌కీయ ప‌రిణామాల అనంత‌రం అదే తేరాస‌లో చేరిన విష‌యం తెలిసిందే. కేటీఆర్ ఆహ్వానంతో పార్టీలోకి వ‌చ్చిన దానంకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కేటాయించ‌క‌పోయినా సైలెంట్‌గానే వున్నాడు. అయితే దానంతో పాటు తేరాస‌ పార్టీలో చేరాల‌నుకున్న ముఖేష్ గౌడ్ ను మాత్రం కేసీఆర్‌, కేటీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.

తేరాస పార్టీలో చేర‌డానికి ముఖేష్ సిద్దంగా వున్నా ఆ పార్టీ నాయ‌కులు ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే 105 నియోజ‌క వ‌ర్గాల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి ప్ర‌తిప‌క్షాల‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిన కేసీఆర్ టికెట్ల పంప‌కం విష‌యంలో పార్టీలో ఆసంతృప్తి మొద‌లు కావ‌డంతో ఏం చేయాలో తెలియ‌క త‌ల‌ప‌ట్టుకుంటున్నా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ గంద‌ర‌గోల ప‌రిస్థితుల్లో పార్టీలోకి ముఖేష్ గౌడ్ వ‌స్తే మ‌రింత గంద‌ర‌గొళం ఏర్ప‌డే అవ‌కాశం వుంద‌ని, ఆ కార‌ణంగానే ముఖేష్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించ‌డానికి కేసీఆర్ జంకుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

దానం నాగేంద‌ర్ కంటే ఆల‌స్యంగా పార్టీలోకి రావాల‌నుకోవ‌డ‌మే ముఖేష్ గౌడ్ కొంప ముంచింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తేరాస‌లో చేరాలన్న ఆశ‌తో సొంత పార్టీని ప‌క్క‌న పెట్టిన ముఖేష్‌కు మొద‌టికే మోసం వ‌చ్చేలా ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖేష్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న గోషా మ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి దానం నాగేంద‌ర్ ని పోటీకి దింపాల‌ని, అదే స‌మ‌యంలో దివంగ‌త కాంగ్రెస్ నేత జ‌న‌ర్థ‌న్‌రెడ్డి కూతురు విజ‌యారెడ్డిని ఖైర‌తాబాద్ నుంచి బ‌రిలోకి దింపాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తుండ‌టం ముఖేష్‌ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల అంటున్నాయి. ఈ నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ముఖేష్ మ‌ళ్ళీ సొంత గూటికే ప‌రిమితం కావాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ని, అత‌న్ని క్ష‌మించి కాంగ్రెస్ అధిష్టానం గోషా మ‌హ‌ల్ టికెట్ ఇస్తుందో లేక తెర‌వెన‌కే వుండేలా చేస్తుందో చూడాలి.