ముంబై కి అదే దెబ్బ… చివరి బంతికి సన్ రైజర్స్ విజయం!

Friday, April 13th, 2018, 09:57:03 AM IST

ఐపీఎల్ లో ప్రస్తుతం అసలైన క్రికెట్ మాజాని అభిమానులు చాలానే చూస్తున్నారు. ముంబై ఇండియన్స్ – హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో అసలైన థ్రిల్ కనిపించింది. చివరి నిమిషం వరకు అభిమానులు ఎంతో ఉత్కంఠకు లోనయ్యారు. ఒక బంతి ఒక పరుగు మాత్రమే ఉన్న సమయంలో బంతి బౌండరీ దాటగానే అభిమానుల ఆనందాలకు అవధులు లేవు. ముంబై జట్టు రెండవసారి కూడా అదే తరహాలో ఓటమిని చూసింది. మొదట చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కూడా వారికి ఇలాంటి దెబ్బె తగిలింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఎప్పటిలానే మళ్లీ తడబడింది. హైదరాబాద్ జట్టు బౌలింగ్ ధాటికి స్ట్రాంగ్ బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. లూయిస్ 29, పొలార్డ్ 28, సూర్యకుమార్ యాదవ్ 28 పరుగులతో పరవాలేదు అనిపించారు. టోటల్ గా 147 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆరంభం అధరోగొట్టినా ఆ తరువాత వరుసగా ముంబై బౌలర్లకు వికెట్లు సమర్పించేశారు. 62 పరుగులకు వరకు ఒక వికెట్ కూడా కోల్పోని హైదరాబాద్ 20 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయింది. మయాంక్ మార్కండ్ కీలకమైన నాలుగు వికెట్లు తీసి హైదరాబాద్ జట్టును దెబ్బ కొట్టాడు. ఆ తరువాత బుమ్రా (వికెట్లు 2) – ముస్తాఫిజుర్‌(3) విజృభించడంతో విజయం ముంబైదే అని అంతా అనుకున్నారు. కానీ చివరి వరకు ఉన్న దీపక్ హుడా( పరుగులు 32) మంచి ఆటతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో 11 పరుగులు కావల్సిన సమయంలో సిక్స్ కొట్టి సులభం చేశాడు. ఆ తరువాత నాలుగు బంతులకో పరుగు రావడంతో చివరి బంతికి ఒక పరుగు చేయాలి. ఆ చివరి బంతిని స్టాన్‌లేక్‌ బౌండరీ తరలించి జట్టుకు విజయాన్ని అందించాడు.