పవన్ కోసం చంద్రబాబు సొంత నేతలను పట్టించుకోలేదు: మురళి మోహన్

Saturday, March 31st, 2018, 03:07:52 PM IST

పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబుపై పవన్ మాటలతో విరుచుకుపడటం తెలుగు దేశం పార్టీ నేతలకు అస్సలు నచ్చడం లేదు. దీంతో పవన్ విమర్శలపై స్పందిస్తూ ఆయనపై కూడా గట్టిగా ప్రతివిమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ ప్లాన్ చేసిన కుట్రలో భాగంగానే పవన్ ఆ విధంగా విమర్శలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఎంపీ మురళి మోహన్ కూడా అదే స్థాయిలో పవన్ కు కౌంటర్ ఇచ్చారు.

అంతే కాకుండా చంద్రబాబు పవన్ కు ఏ స్థాయిలో గౌరవిస్తారు అనే విషయాన్ని కూడా చెప్పారు. మురళి మోహన్ మాట్లాడుతూ.. సొంత పార్టీలో ఏ వ్యక్తికి ఇవ్వని ప్రాధాన్యతను చంద్రబాబు పవన్ కి ఇచ్చారు. కీలక నేతలు కలవడానికి వస్తే.. అయిదు నిముషాలు కూడా కేటాయించని చంద్రబాబు. పవన్ కలవడానికి వస్తే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయన వస్తుంటే కారుకు ఎదురెళ్లి తీసుకువచ్చేవారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఎంతో మరియాదగా కారు వరకు వెళ్లేవారు. ఈ స్థాయిలో అనుబంధం ఉన్నప్పుడు చంద్రబాబు ఏదైనా తప్పు చేస్తే.. ‘మీరు తప్పు చేస్తున్నారు, కాస్త మార్చుకోండి’ అని పవన్ చెప్పాలి.

కానీ అలా కాకుండా మీడియా ముందుకు వెళ్లి విమర్శలు చేశారు. మొన్నటి వరకు ఎంతో పొగిడిన పవన్ సడన్ గా యూ టర్న్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తూ.. పరిస్థితులను చూస్తుంటే పవన్ వెనుక ఉండి ఎవరో ఇదంతా చేయిస్తున్నారని అనిపిస్తోందని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ని ప్రేమించే వ్యక్తిగా చెబుతున్నా.. ఈ విషయం గురించి మరోసారి ఆలోచించాలని మురళి మోహన్ వివరించారు.