ఆయన మీద హత్య కేసులు నమోదు చేయాలి : వైఎస్ జగన్

Wednesday, May 16th, 2018, 04:10:09 PM IST

మొన్న గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో దాదాపు 40మంది చనిపోవడం పై వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, నిజానికి ఇవి సర్కారు వారి హత్యల కిందకే వస్తాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు భద్రత, భరోసా లేకుండా పోతోందని, అందుకే ప్రజల భవిష్యత్తు అయోమయంలో పడిందన్నారు. మరోవైపు ఇదివరకు పోయిన నవంబర్ లో విజయవాడలో చంద్రబాబు నివాసానికి దగ్గరగా కృష్ణ నదిలో జరిగిన బోటు ప్రమాదంలో 20మంది చనిపోయారని,

అసలు ఇటువంటి ఘటనలు బోట్ లైసెన్సులు లేకుండా తిప్పుతూ ప్రభుత్వం, మంత్రులు లంచాలు పుచ్చుకోవటం వల్లనే జరుగుతున్నాయని మండిపడ్డారు. తమ ప్రబుత్వం అధికారంలోకి వస్తే బోట్ నడిపే వారికి అన్నివిధాలుగా అర్హతలు, ఇతర తనిఖీలు జరిపిన తరువాతనే లైసెన్స్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఐదురోజుల క్రితమే ఒక బోట్ కు అగ్నిప్రమాదం జరిగిందని అదృష్టంకొద్దీ ఆ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదని, వెనువెంటనే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన ప్రతిసారి చంద్రబాబు బయటకు వచ్చి మొసలి కన్నీరు కార్చి, ఇటువంటి ఘటనలు మళ్లి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటాం అని తమ అనుకూల మీడియా వారికీ ఒక మాట చెప్పి వెళ్ళిపోతారని అన్నారు.

అలానే అదివరకు జరిగిన పుష్కరాల్లో కూడా దాదాపు 12మంది మృత్యువాత పడ్డారని, ఇలాంటివి ఎన్ని జరిగినా చంద్రబాబుకు కానీ, ఆయన ప్రభుత్వ మంత్రులకు గాని ఏమిపట్టదని, కేవలం డబ్బు దండుకోవడమే వారి ముఖ్య ఉద్దేశ్యమని ఎద్దేవా చేసారు. ఇప్పటివరకు జరిగిన ఈ హత్యలకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కేవలం 100 బోట్ లను కంట్రోల్ చేయలేని చంద్రబాబు ప్రభుత్వమే ఈ మరణాలకు కారణమని, అందువల్ల ఆయన మీద హత్య నేరం కింద కేసు నమోదు చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు తన తరపున, పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు తెలిపారు……

  •  
  •  
  •  
  •  

Comments