రాబోయే ఎన్నికల్లో వారికే తన మద్దతు అంటున్న జన సేనాని!

Sunday, January 28th, 2018, 03:50:46 AM IST

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎవరితో కాలుస్తారో, ఎవరికి తన మద్దతు ఇస్తారో, అసలు ఎవరికి మద్దతు ఇవ్వకుండా పోటీ చేస్తారా, అన్నదే ఇప్పుడు అందరిలోనూ పెద్ద చర్చనీయాంశం అయింది. ఐతే ఆయన ఈరోజు అనంతపురం లో జరిగిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం, అక్కడ రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు తమ పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందన్నారు. ఎవరైతే రైతులకు అండగా వుంటారో, రైతు కన్నీరు తుడుస్తారో వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంగా తెలిపారు. ఒకవేళ ఏ పార్టీకి అయినా తమ పార్టీ మద్దతు ఇవ్వవలసివస్తే ఏ విధంగా వారు అనంతపురానికి అండగా ఉంటారనేది ముందుగా అడుగుతానని అన్నారు. తనకు, తమ పార్టీ కి అనంతపురం మద్దతు కావాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. ఓటు వేయమని వచ్చిన రాజకీయ నాయకులను ఇక్కడి ప్రజలకు ఏమి చేసారని అడిగి నిలదీయాలన్నారు. ఇక్కడి ప్రజలకు అన్ని విధాలా తన మీద, తన పార్టీ మీద నమ్మకం ఉంటేనే తనకు ఓటేయాలని, లేదంటే తనను ఓడించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అనంతపురం ప్రజలు ఇకనైనా పట్టు బిగించకపోతే ఇక్కడి రైతన్నల, ప్రజల సమస్యలు ఎప్పటికి పోవు అన్నారు. తమ అందరు పార్టీల్లా కాదని, తమది ప్రజాపక్ష, రైతుపక్ష పార్టీ అని చెప్పారు….