నాగబాబు – బాలయ్య వార్: ఎట్టకేలకు స్వస్తి చెప్పిన మెగా బ్రదర్..!

Friday, January 11th, 2019, 11:00:02 AM IST

మెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలకృష్ణపై గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే, తాజాగా చిరంజీవిపై గతంలో బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్ గా కామెంట్ చేసారు నాగబాబు. చిరంజీవి ఎన్టీఆర్ కాళీ గూటికి కూడా సరిపోడు అంటూ గతంలో బాలయ్య అన్నారు, వాటిపై స్పందించిన నాగబాబు నోరు అదుపులో పెట్టుకోండంటూ బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ మాటలతో తమకు చాలా బాధ కలిగిందన్నారు. దీంతో చిరంజీవి స్పందిస్తూ,”బాలయ్య చిన్నపిల్లాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు” అని వదిలేశారని గుర్తుచేశారు.రిక్షా తొక్కే వ్యక్తి ఆయన కొడుక్కి గొప్ప కావొచ్చనీ, బాలయ్య తన తండ్రి గొప్పతనాన్ని కీర్తించుకోవడం ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. అయితే పక్కనవారిని అవమానించడం ఏంతవరకూ సబబని ప్రశ్నించారు. బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఆరో వీడియోను విడుదల చేశారు.

వీడియోలో బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన నాగబాబు “చిరంజీవి కాలిగోటికి కూడా బాలకృష్ణ సరిపోడు” అని చెబితే మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యాన్స్, మీ ఇంట్లో, పార్టీ వాళ్లకు ఎలా ఉంటుంది? ఎంత అహంకారం మీకు? మాకు కోపాలు రావా? సర్, మర్యాదగా చెబుతున్నా మీకు దయచేసి మాట్లాడేప్పుడు నోరును అదుపులో పెట్టుకోండి. మీరు వంద విమర్శలు చేయండి. కానీ లూజ్ టంగ్ తో మాట్లాడకండి. కేవలం సంస్కారంతోనే మేం ఆగుతున్నాం. ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడరు. మా అన్నయ్య, తమ్ముడిని అంటే మాత్రం ఎవరైనా అంటే మాత్రం 100 శాతం రియాక్ట్ అవుతాం. ఇప్పటికైనా ఈ లూజ్ టంగ్ ను ఆపేస్తారని ఆశిస్తున్నాం” అని తెలిపారు.పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవాలనీ, రాజకీయ విమర్శలు చేయొచ్చని నాగబాబు స్పష్టం చేశారు. అలాంటి వాటిపై తాను రియాక్ట్ కాబోనన్నారు. చిరంజీవి అంటే కేవలం తమకు అన్నయ్య మాత్రమే కాదనీ, తండ్రితో సమానమని వ్యాఖ్యానించారు. తమ అన్నదమ్ముల మధ్య చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయనీ, కానీ తాము ముగ్గురం కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఇకపై తానూ బాలకృష్ణను విమర్శించబోనని అన్నారు , ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ చెప్పనున్నట్టు తెలిపారు. మెగా ఫాన్స్ కూడా ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయాలని కోరారు.