రోజాను అవమానించి ఆపై దాడి చేశారు!

Saturday, September 13th, 2014, 10:16:27 AM IST


చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాకు అమ్మవారి జాతరలో ఘోర పరాభవం ఆపై దాడి జరిగాయి. దీనితో నగరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలలోకి వెళితే శనివారం నగరి అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హారతి ఇవ్వడం రివాజు. ఈ నేపధ్యంగా అమ్మవారికి హారతి ఇచ్చేందుకు ఎమ్మెల్యే రోజా సిద్ధపడుతుండగా జాతర పెద్ద కుమరేశన్ మొదలియార్ అడ్డుకున్నారు. ఇక దీనితో జరిగిన తోపులాటలో రోజా చేతిలోని హారతి పళ్లాన్ని ప్రత్యర్ధి వర్గం లాక్కున్నారు. ఈ క్రమలో రోజా చేతికి గాయమైంది. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అధికార పక్షమైన టిడిపి నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే రోజాపై దాడికి దిగారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అలాగే టిడిపి నేతల దౌర్జన్య కాండకు ఈ ఘటన తార్కాణంగా నిలుస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.