రాజకీయాల్లోకి రావాలని నందమూరి వారసుల తహతహలు !

Sunday, September 30th, 2018, 01:37:31 PM IST

ఒక కుటుంబానికి సినీ నేపథ్యం ఉంటే అందులోని తర్వాతి తరం వారసులు సినిమాల్లోకి రావాలని ఉవ్విళూరుతుంటారు. ఒకవేళ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే వాటిలోకి వెళ్లాలని అనుకుంటారు. ఒకవేళ రెండూ ఉంటే… ఆ కోరిక మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నందమూరి వారసుల్లో కొంతమంది పరిస్థితి ఇలానే ఉంది.

తాత ఛరీష్మాన్ని నమ్ముకుని సినిమాల్లోకి వచ్చిన కొందరు అదే ఛరీష్మాని బేస్ చేసుకుని రాజకీయాల్లోకి దూకాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ పార్టీలో తన తండ్రి హరికృష్ణ స్థానాన్ని పూరించేందుకు సిద్ధంగా ఉన్నారని సంకేతాలు వస్తుండగా ఇప్పుడు మరొక వారసుడు తారక రత్న బహిరంగంగానే రాజకీయాల్లోకి రావాలనే తన కోరికను బయటపెట్టాడు.

కెరీర్ ఆరంభంలో హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆయన ప్రస్తుతం సినిమాలోను దూరంగానే ఉంటున్నారు. తాజాగా నూజివీడులోని రావిచర్లలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అవకాశమిస్తే టీడీపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఒకవేళ పోటీ చేయకపోయినా పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని మాటిచ్చేశారు. మరి ఈ నందమూరి వారసుడి మనసులో మాట చంద్రబాబు చెవికి ఎక్కుతుందో లేదో చూడాలి.