నాని నేను సీత‌య్య టైపు!

Wednesday, September 5th, 2018, 02:52:40 PM IST

నాని సీత‌య్య టైపు. ఎవ‌రేం తిట్టేసినా తాను చేయాల్సిందే చేస్తాడు. అంతా నా ఇష్టం ఆర్జీవీ టైపు. అస‌లు ఎవ‌రి మాటా విన‌ని టైపు. ఇదీ బిగ్‌బాస్ షో హోస్ట్ హోదాలో నాని నిర్వాకం అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. `బిగ్ బాస్ -2` హోస్ట్, నేచుర‌ల్ స్టార్ నానిపై విమ‌ర్శ‌ల ఝ‌డివాన‌ కురుస్తూనే ఉంది. బిగ్ బాస్ సెట్ లో నాని కొంత‌మందికే స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని, హోస్ట్ బాధ్య‌త‌ల్ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌లేద‌ని, గేమ్ ర‌క్తిక‌ట్ట‌క‌పోవ‌డానికి నాని ప‌రోక్ష కార‌కుడ‌ని, కొన్ని రోజులు గా నెటిజ‌నులు ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ హోస్ట్ గా, నిర్వాహ‌కులు నానిని ఎలా ఎంపిక చేసార‌ని నిర్వాహ‌కుల్ని ఆడుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. నాని వీటిని మొద‌ట్లో పట్టిచుకోక‌పోయినా ఇప్ప‌డు చెవికెక్కించుకోవాల్సి వ‌చ్చింది. ఇక నావ‌ల్ల కాదు… భ‌రించ‌లేనంటూ ఆ ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చాడు. ఎవ‌రెన్ని అనుకున్నా? ఎవ‌రెలా అనుకున్నా? నేను హోస్ట్ గా క‌రెక్ట్ గా ఉన్నాను.. అన్న‌దే నాని వెర్ష‌న్‌.

పార్టిసిపెంట్స్ అంద‌రి విష‌యంలోనూ స‌మ‌న్యాయం పాటిస్తున్నా. నేను ఎవ‌రి ప‌క్షమూ కాదు. ఎవ‌రికీ వ్య‌తిరేకినీ కాదు. నాకు అంద‌రూ స‌మాన‌మే. నాకు తోచిన‌ట్లు గేమ్ ఆడుతున్నా. పార్టిసిపెంట్స్ వాళ్ల అనుకూల‌తను బ‌ట్టి వాళ్లు ఆడుతున్నారు. గేమ్ చివ‌రి ఎపిసోడ్ వ‌ర‌కూ ఇలాగే ఉంటా. మీ కోసం నేను మారాల్సిన ప‌నే లేదు అన్న‌ట్టే మాట్లాడాడు. త‌ప్పులు స‌రిదిద్దుకోమ‌ని అభిప్రాయ‌ప‌డితే ఇలా వైరాగ్యం చూపించ‌డం ఏంటి? జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న‌ప్పుడు రాని విమ‌ర్శ‌లు ఇప్పుడే ఎందుకు వ‌స్తున్నాయి? ఓ సారి ఆలోచించు నాని అంటూ జ‌నం క్లాస్ తీస్కుంటున్నారు. ఈ ప్ర‌భావం నాని సినిమాల‌పై ప‌డే అవ‌కాశం లేక‌పోలేద‌ని ప‌లువురు అంటున్నారు. ప్ర‌స్తుతం నాగార్జున‌తో నాని క‌లిసి `దేవ‌దాస్` సినిమాలో న‌టిస్తున్నాడు. `జెర్సీ` అనే మ‌రో సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments