టీవీ సీరియ‌ళ్ల‌పై న‌న్న‌ప‌నేని ఎటాక్‌!!

Sunday, October 15th, 2017, 12:22:13 PM IST

అత్త‌ను చంప‌డ‌మెలా? క‌సితీరా హింసించ‌డ‌మెలా? కోడ‌లి కాపురంలో నిప్పులు పోయ‌డ‌మెలా? వెక్కి వెక్కి ఏడ్చేలా క‌న్నీరుమున్నీర‌య్యేలా చేయ‌డ‌మెలా? శ‌త్రువుపై కుట్ర ఎలా ప‌న్నాలి? ప‌గ‌లు-ప్ర‌తీకారాలు ఎలా తీర్చుకోవాలి? అమాయ‌కంగా క‌నిపిస్తూ పీక‌లు కోయ‌డ‌మెలా? బ‌్లేడ్‌తో కుత్తుక‌లు తెగ కోసేదెలా? .. ఇలాంటివ‌న్నీ బుల్లితెర‌పై ఉచితంగా ల‌భించును. అది కూడా టీవీ సీరియ‌ళ్ల రూపంలో. నేరాలు -ఘోరాలు కంటే ఘోర‌క‌లికి సంబంధించిన క‌లికాల‌పు టీవీ సీరియ‌ళ్ల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంతా మంచిదే. అత్తా-కోడ‌ళ్ల గొడ‌వ‌లు.. ఆడాళ్ల‌లో క్రైమ్ ఆలోచ‌న‌లు.. హింసాత్మ‌క‌మైన మైండ్ గేమ్స్ .. వీటినే హైలైట్‌గా చేస్తూ టీవీ సీరియ‌ళ్ల‌ను తెర‌కెక్కిస్తున్న వైనంపై సెన్సార్ క‌త్తెర ప‌డ‌క‌పోవ‌డం పెను ప్ర‌మాదానికి సంకేతంగా మారింది. ఆడాళ్ల‌లో నేర ప్ర‌వృత్తిని పెంచి పోషిస్తున్న ఈ పాయిజ‌న‌స్ టీవీ సీరియ‌ళ్ల నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడ‌డ‌మెలా? అన్న‌ది పెద్ద టాస్క్‌.

అందుకే ఇలాంటి హింసాత్మ‌క సీరియళ్ల‌పై సెన్సార్ క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేసేందుకు స‌న్న‌ద్ద‌మవుతోంది ఏపీ ప్ర‌భుత్వం. ఆ మేర‌కు ఏపీ తేదేపా సీనియ‌ర్‌ నాయ‌కురాలు నన్నపనేని రాజకుమారి ప్ర‌భుత్వానికి ఓ నివేదిక‌ను అంద‌జేయ‌నున్నారుట‌. ఏపీ స్టేట్ ఉమెన్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న న‌న్న‌ప‌నేని.. క్రైమ్ – వ‌ల్గారిటీ- శృంగారం, హింస‌.. పాళ్లు ఎక్కువ‌గా ఉన్న టీవీ సీరియ‌ళ్ల‌పై సెన్సార్ క‌త్తెర వేసే అంశాన్ని సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్నారుట‌. అయితే ప‌దుల సంఖ్య‌లో అనునిత్యం లైవ్ అవుతున్న సీరియ‌ళ్ల‌లో ఎపిసోడ్ ఎపిసోడ్‌కి క‌త్తిరించ‌డ‌మంటే క‌ష్ట సాధ్య‌మైన ప‌ని. అయితే దీనికి త‌రుణోపాయంగా .. ప్ర‌తి ఎపిసోడ్‌ని ముందుగా సెన్సార్ క‌మిటీల ముందుకు పంపించి ప‌రిశీలించేలా చేయాలి. దీనికోసం మ‌హిళామ‌ణుల‌తో కూడుకున్న కొన్ని బృందాల్ని ఏర్పాటు చేయాలి. ఏపీ ప్ర‌భుత్వం ఏం చేయ‌బోతోందో చూడాలి.