దేవాన్ష్ బర్త్ డే సంబరాలు.. శ్రీవారి సన్నిధిలో నారా ఫ్యామిలీ

Wednesday, March 21st, 2018, 03:38:49 PM IST

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శనం చేస్కున్నాడు. మంగళవారం రాత్రి బాబు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు దగ్గరుండి స్వామి వారి దర్శన ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలు చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సతి భువనేశ్వరీ, కుమారుడు మరియు మంత్రివర్యులు నారా లోకేష్, సతి నారా బ్రహ్మణీ, హింధుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులు, బాబుగారి ముద్దుల మనవడు దేవాన్ష్ లతో కలిసి వైకుంఠం మార్గం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు, అర్చకులు ఘనంగా ఇస్థికాపాల్ స్వాగతం పలికారు.

తదనంతరం ఆలయంలోకి ప్రవేశించి ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్,జేఈవో శ్రీనివాస రాజులు.. ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రి లోకేష్ దంపతులకు, నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో సీఎం చంద్రబాబు చాలా ఆవేదనతో మాట్లాడారు. తిరుమలలో రాజకీయాలు ఎప్పుడూ మాట్లాడకపోయినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, కేంద్రం చేస్తున్న కుట్ర పూరిత మోసం గురించి తీవ్ర ఆవేదన చెందారు. రాష్ట్రానికి ఎవ్వరు ఏమి అన్యాయం చేసిన వేంకటేశ్వర స్వామి చూస్తు ఊరుకోరని… గతంలో అలా మాట తప్పిన వారికి ఎలా గుణపాఠం చెప్పారో అందరికీ తెలుసన్నారు.

అనంతరం సీఎం అక్కడి నుండి శ్రీవారి నిత్య అన్నప్రసాద కేంద్రానికి చేరుకుని అక్కడ భక్తులతో కలిసి సహపంక్తి భోజనంచేశారు. భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించడమే కాకుండా వారితో కలిసి ప్రసాదాలను స్వీకరించడం కొంత మంది భక్తులను అసౌకర్యానికి గురిచేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య, నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణీ, నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధరలు ఇతర కుటుంబ సభ్యులు అన్న ప్రసాదం వితరణలో పాల్గొన్నారు. ఇదే సమయంలో తన మనవడి 3వ పుట్టిన రోజు సందర్బంగా సీఎం స్వామి వారి అన్నదానం ట్రస్ట్ కు రూ. 26 లక్షలు విరాళంగా ఇచ్చారు.