ఓడింది ఎన్నికల్లో, ప్రజాభిమానంలో కాదు – నారా లోకేష్

Sunday, May 26th, 2019, 11:30:51 PM IST

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైసీపీ గెలిపించుకున్నారు. కాగా ఏపీలో రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చిందని ప్రజలందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారంతా. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో చాల మంది సీనియర్ నాయకులూ, మంచి హేమాహేమీలు, పెద్ద నేతల వారసులు కూడా ఓటమిపాలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా చాలా దారుణంగా ఓడిపోయారు. అయితే ఓటమి నుండి కాస్త తేరుకున్న లోకేష్ ఏపీలో సమీక్షలు నిర్వహించనున్నారు. “తన ఓటమిపై బాధపడటం లేదని.. గెలిచినా, ఓడినా మంగళగిరి ప్రజలతోనే తన ప్రస్థానం కొనసాగుతుందంటూ ట్వీట్లు చేశారు”. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ప్రజలతో ఉన్న అనుబంధాన్ని కోల్పోలేదని, ఇక మంగళగిరి నియోజకవర్గం నా ఇల్లు మీరంతా నా కుటుంబం అని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదు. గడప గడపకు వచ్చాను, గెలిచినా ఓడినా మీతోనే ఉంటాను అని చెప్పాను’అన్నారు లోకేష్.

కాగా చాల ప్రదేశాల నుండి వచ్చిన టీడీపీ కార్యకర్తలను మరియు నేతలను కలుసుకున్న లోకేష్ ప్రజా తీర్పును గౌరవిద్దామని, ఇప్పటినుండి పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడినంత మాత్రన తన మాట మారదని.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ‘మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని’అన్నారు. ఈ ఓటమితో కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా అధైర్య పడొద్దని ఇప్పటినుండి ప్రజల్లో మమేకమైపోవాలని లోకేష్ అన్నారు.