ఎన్టీఆర్ ఫోటోతో ట్వీట్ పెట్టి బుక్కైన నారా లోకేష్ !

Friday, September 28th, 2018, 05:21:25 PM IST

నారా చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడో తెలీదు కానీ ఇంతవరకు ప్రజల మెప్పు పొందలేకపోయారాయన. ఎప్పటికప్పుడు బహిరంగ సభల్లో అక్షర దోషాలు, వాఖ్య దోషాలు మాట్లాడుతూ తనకు తెలీకుండానే టీడీపీని నవ్వులపాలు చేసిన లోకేష్ మరోసారి సోషల్ మీడియాలో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు.

ఎన్టీఆర్ భవన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా చెప్పారో లేకపోతే లోకేష్ స్వయంగా గమనించాడో తెలీదు కానీ రాత్రి సమయంలో ఎన్టీఆర్ చేతిలో చందమామ ఉన్నట్టు అనిపిస్తున్న దృశ్యాన్ని క్యాప్చర్ చేసి ట్విట్టర్లో పెట్టి మళ్ళీ రాష్ట్రంలో చంద్రోదయం అంటున్న అన్నగారు అని రాశారు.

దీన్ని చూసిన నెటిజన్లు అన్నగారి చేతిలో చంద్రుడు సంపూర్ణంగా ఉండి ఉంటే అది చంద్రోదయం అనే మాటకు అర్థం ఉంటుంది కానీ అక్కడున్నది నెలవంక. అంటే సగం కరిగిపోయిన చంద్రుడు. దీనికి వేరే అర్థం వచ్చేలా ఉంది. ఎందుకిలాంటి ట్వీట్లు వేసి కష్టాలు కొని తెచ్చుకుంటారు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఎంతైనా మరి లోకేష్ ఓపెన్ ఫ్లాట్ ఫార్మ్స్ మీద ట్వీట్లయినా మాటలైనా ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తే ఇలాంటి తిప్పలు తప్పుతాయి.