నేష‌న‌ల్‌ మీడియా ఒపీనీయ‌న్ పోల్స్ రిజ‌ల్ట్స్ అవుట్.. టాప్ గేరులో టీఆర్ఎస్.. మ‌హాకూట‌మికి చిత్త‌డే..!

Wednesday, October 10th, 2018, 01:46:26 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఏడాదివ‌ర‌కు స‌మ‌యం ఉండ‌గా.. తెలంగాణ‌లో మాత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌ధ్యంలో వ‌రుస‌గా అనేక‌ స‌ర్వేలు తెర‌పైకి వ‌చ్చి రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. అయితే ఇప్ప‌డు తాజాగా ఒపీనియ‌న్ పోల్ విడుద‌ల చేసింది జాతీయ‌మీడియా.

దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా స‌ర్వేలు జ‌రిపించి ఖ‌చ్ఛిత‌మైన రిపోర్ట్స్ ఇవ్వ‌డంలో నేష‌న‌ల్ మీడియాల్లో ఒక‌టైన ఎన్డీటీవీ ముందంజ‌లో ఉంటుంది. ఈ నేప‌ధ్యంలో తాజాగా ఎన్డీటీవీ.. త్వ‌ర‌లో ఎన్నిక‌లుజ‌రుగ‌నున్న నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒపీనియ‌న్ పోల్స్‌ను విడుద‌ల చేసింది. తెలంగాణ‌లో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి 85 స్థానాలు వ‌స్తాయని ఎన్డీటీవీ ఒపీనియ‌న్ పోల్స్ తేల్చేసింది.

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో.. అక్క‌డ మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా.. క‌నీస మెజారిటీ రావాలంటే 60 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించాలి. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో విజ‌య‌సాదించింది. అయితే ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీ గ‌తంలో కంటే మ‌రింత బ‌లం పుంజుకుంద‌ని.. ఈసారి ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి 22 స్థానాలు అద‌నంగా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఎన్డీటీవీ ఒపీనియ‌న్ పోల్ స‌ర్వే రిపోర్టు తేల్చేసింది.

ఇక గత ఎన్నిక‌ల్లో, కాంగ్రెస్ పార్టీకి 21సీట్లు రాగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ప‌ర్టీకి 16 నుండి 18 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఆ స‌ర్తే తేల్చేసింది. అంతే కాకుండా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మి క‌లిసి పోటీ చేయ‌గా.. టీడీపీకి-15, బీజేపీకి-5 అసెంబ్లీ సీట్లు ద‌క్కాయి. అయితే ఈసారి ఎన్నిక‌ల్లో టీడీపీకి అంత సీన్ ఉండ‌ద‌ని.. ఈ స‌ర్వే తేల్చింది. ఇక‌పోతే ఎంఐఎంకు 7 స్థానాలు, ఇతరులకు 4 స్థానాలు దక్కనున్నట్టు వెల్లడించింది. అయితే ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా టీఆర్ఎస్‌ను ఓడించాల‌ని.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు ఒక్క‌టై మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌ర్వే రిపోర్టు ఈ మ‌హా కూట‌మికి పెద్ద షాకే అని చెప్పొచ్చు. మ‌రి టాప్ గేరులో దూసుకుపోతున్న గులాబీ ద‌ళ‌ప‌తిని.. అత‌ని ద‌ళాన్ని మ‌హాకూట‌మి ఎలా ఎదుర్కొంటుందో చూడాలని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.