న‌యీమ్ గ్యాంగ్స్ చ‌ప్పుడు లేకుండానే!?

Monday, September 17th, 2018, 02:55:07 PM IST

2016లో పేరు మోసిన గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్ ఎన్‌కౌంట‌ర్ అనంత‌ర ప‌రిణామాల గురించి తెలిసిందే. పోలీసులు బ‌లం పెంచుకుని న‌యీమ్ గ్యాంగ్స్‌ని వెంటాడి వేటాడి అరెస్టులు చేశారు. అటుపై బ‌డా రాజ‌కీయ నేత‌ల అండ‌దండ‌ల‌తో న‌యీమ్ ముఠాలు అన్నీ బ‌య‌ట‌ప‌డిపోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర డిబేట్ సాగింది. సంఘంలో నేర‌స్తులు, అరాచ‌క శ‌క్తులు బ‌య‌ట య‌థేచ్ఛ‌గా తిరిగితే ఎలా ఉంటుందో మొన్న‌టి ఘ‌ట‌న‌తో ఉలిక్కిపాటున‌ మ‌రోసారి తెలిసొచ్చింది. ప్రేమికుడు ప్ర‌ణ‌య్ హ‌త్య‌తో న‌యీమ్ గ్యాంగ్‌కి ఉన్న సంబంధాల‌పైనా పోలీసులు ఆరాలు తీస్తున్నారు. ఈ లింకులో ఓ ఎమ్మెల్యే, ఇత‌ర నాయ‌కుల భోగోతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బిజినెస్‌మేన్- రాజ‌కీయ నాయ‌కుల సంబంధాలు, కుల రాజ‌కీయాలు, కులం గ‌బ్బు బ‌య‌ట‌ప‌డింది.

ఓవ‌రాల్‌గా ఈ ప‌రిణామాల‌న్నీ స‌మాజాన్ని ఎటు తీసుకెళుతున్నాయోన‌న్న భ‌యం ప్ర‌జ‌ల్లో దుమారం రేపుతోంది. మ‌రోవైపు న‌యీమ్ గ్యాంగ్స్ గుట్టు చ‌ప్పుడు కాకుండా ఎన్నో అరాచ‌కాల్ని య‌థేచ్చ‌గా సాగించ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. న‌యీమ్ ముఠాలు సుఫారీలు తీసుకుని హ‌త్య‌లు చేయ‌డం, సెటిల్‌మెంట్ల‌కు పాల్ప‌డ‌డం వంటి క‌ఠోర‌నిజాలు జ‌నాల్ని ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి. క్రైమ్ అంత‌కంత‌కు పెరుగుతోంది. అంతేకాదు రాజ‌కీయ నాయ‌కులే న‌యీమ్ అనుచ‌రుల వెంట ఉండి ఈ ప‌నుల‌న్నీ చేయిస్తున్నార‌ని బ‌య‌ట‌ప‌డింది. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో భూదందాలు, సెటిల్‌మెంట్ల హోరు మ‌ళ్లీ ప‌తాక స్థాయికి చేరుతోంద‌ని తెలిసొచ్చింది. మొత్తానికి ముగిసిపోయింది అనుకున్న అరాచ‌కం మ‌ళ్లీ కోర‌లు సాచింది. అది ఎంత విష‌పూరిత‌మైనదో తొంద‌ర్లోనే తెలిసొస్తుంది. నిన్న‌టి ప్ర‌ణ‌య్ ఘ‌ట‌న కేవ‌లం ఆరంభం మాత్ర‌మే. ఇక‌పోతే అధికారంలో ఉన్న రాజ‌కీయ నాయ‌కులు ఎంత‌కైనా తెగిస్తార‌ని ప్ర‌ణ‌య్ ఉదంతం చెబుతోంది.