637కోట్ల నీర‌వ్‌ ఆస్తులు జ‌ప్తు.. వైట్ కాల‌ర్ నేర‌గాళ్ల‌కు పాఠం

Monday, October 1st, 2018, 02:21:06 PM IST

వైట్ కాల‌ర్ నేర‌గాళ్లు .. ప‌రిచ‌యం అక్క‌ర్లేని ప‌దం ఇది. ద‌ర్జా దొంగ‌లు అని అంటే సులువుగా అర్థం అవుతుందేమో. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవ‌డం, తిరిగి చెల్లించ‌కుండా ముఖం చాటేయ‌డం. దీనిని ద‌ర్జా దొంగ‌తనం అన‌కుండా ఉండ‌గ‌ల‌మా? నీర‌వ్ మోదీ.. విజ‌య్ మాల్యా లాంటి వాళ్లే కాదు.. ఇలాంటి వాళ్లు ఏపీ, తెలంగాణ‌లోనూ అడుగ‌డుగునా ఉన్నారు. పాల‌నాధికారం చేతిలో పెట్టుకుని దోచుకు తింటున్న ద‌గుల్భాజీల‌కు కొద‌వేం లేదు.

అప్ప‌ట్లో నీర‌వ్ మోదీ ఉదంతం ఓ పెను సంచ‌ల‌నం. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కేసులో వేగంగా పావులు క‌ద‌ప‌డంలో చ‌ట్టాలు అడ్డుప‌డ్డాయి. అత‌డు విదేశాల‌కు పారిపోవ‌డంతో చిక్కు ముడి ఇన్నాళ్లు వీడ‌లేదు. కానీ ఈ ద‌ర్యాప్తును స‌వ్యంగానే సాగించార‌న‌డానికి తాజాగా.. ఈడీ ఎటాచ్‌మెంట్ ఓ నిద‌ర్శ‌నం. నీరవ్‌, ఆయన కుటుంబసభ్యులకు చెందిన దాదాపు రూ.637కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. భారత్‌ సహా ఐదు దేశాల్లో ఉన్న ఈ ఆస్తులను ఈడీ అత‌డి నుంచి లాక్కున్న‌ట్ట‌యింది. భారత్‌, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్స్‌లను, తదితర ఆస్తులు అన్నిటినీ జ‌ప్తు చేశారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) ప‌రిధిలో నీర‌వ్ ఆస్తుల్ని జ‌ప్తు చేశామ‌ని ఈడీ ప్ర‌క‌టించింది. వజ్రాల వ్యాపారులైన నీరవ్, మెహల్‌ ఛోక్సీ ముంబై- పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్ర‌స్తుతం విదేశాల్లో దాక్కున్నారు.

ఇక‌పై విజ‌య్ మాల్యా వంతు. ఆపై తెలుగు రాష్ట్రాల్లోనూ కోకొల్ల‌లుగా ఉన్న ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల వంతు. ఇదివర‌కూ ఏపీలోని బ‌డా నాయ‌కుల పేర్ల‌న్నీ బ్యాంకు అప్పులు ఎగ్గొట్టిన జాబితాలో నిలిచాయి. వీళ్లంతా వంద‌ల‌, వేల కోట్లు బినామీల రూపంలో దాచుకున్న‌వాళ్లే. దేశ విదేశాల్లో డొల్ల కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టిన‌వాళ్లే. ఆల‌స్యం కావొచ్చు కానీ శిక్ష ఖాయ‌మైన‌ట్టే. వీళ్లంద‌రి నుంచి ముక్కు పిండి మ‌రీ తిరిగి వ‌సూల్ చేసేందుకు మోదీ వ‌ద్ద పెద్ద స్కెచ్ ఉంద‌న్న స‌మాచారం తాజాగా లీకైంది. ఈ లిస్ట్‌లో బిగ్ షాట్స్ ఎవ‌రు? అన్న దానిపై త‌దుప‌రి ఆర్టిక‌ల్ లో చ‌ర్చిద్దాం.. టిల్ దెన్ వెయిట్.. & సీ.