4 ఏళ్ల బాలికపై మరో అగాయిత్యం

Tuesday, April 17th, 2018, 02:49:52 AM IST

పసిమొగ్గలపై లైంగిక దాడుల ఘటనలు తీవ్ర స్థాయిలో జరుగుతుయన్నాయి. ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లాలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికకు చాక్లెట్‌ ఆశచూపి పొరుగున ఉండే 24 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఇంటివద్ద ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని నీలగిరి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రమేష్‌ సింగ్‌ తెలిపారు.

దేశవ్యాప్తంగా మైనర్‌ బాలికలపై లైంగికదాడులు పెచ్చుమీరడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో తాజా ఘటన కలకలం రేపింది. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రేపిస్టులకు మరణ దండన విధించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ నిరవధిక నిరాహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఉన్నావ్‌, కథువా ఘటనలకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు మహిళా సంఘాలు, పార్టీల నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయి.