నగదు కొరతపై జైట్లీ చేసిన ట్వీట్ పై నెటిజన్ల ఫైర్!

Wednesday, April 18th, 2018, 03:48:01 AM IST

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల ఏటీఎం లు డబ్బులు లేక నో కాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఏటీఎంలు బ్యాంకుల్లో నగదు కొరతపై సిల్లీ కామెంట్స్ చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నగదు కొరత ఉందని, అది కూడా అటువంటి ప్రాంతాల్లో అనూహ్యంగా డబ్బుకు డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడిందని, అయితే వెంటనే దీన్ని పరిష్కరించాం అని జైట్లీ ట్వీట్ చేశారు. ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు నానా తిప్పలు పడుతున్న సమయంలో జైట్లీ చేసిన ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అసలు దేశంలో నగదు కొరతే లేదన్నట్లు ఆయన ట్వీట్ ఉందని వారు విమర్శిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇవే పరిస్థితులున్నాయని, కానీ జైట్లీకి మాత్రం అవి కనిపించడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి రిజర్వు బ్యాంకుకు ప్రభుత్వానికి నగదు కొరతపై ఫిర్యాదులు అందుతున్నా జైట్లీకి పట్టడం లేదని మండిపడుతున్నారు. నోట్ల రద్దు సమయంలో ఏటీఎంల వద్ద జనాలు గంటల తరబడిబారులు తీరినట్లు ఇపుడు కూడా నిలుచున్నారని, అవి జైట్లీకి కనబడడం లేదని, ఈ సమస్య నెల రోజుల నుంచి ఉందని ఇపుడు జైట్లీ తాపీగా స్పందించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దేశంలో నగదు లభ్యతను పరిశీలించేందుకు ఆర్ బీఐ ఈ రోజు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. ఆర్బీఐ దగ్గర సరిపడినంత నగదు ఉందని, అసాధారణ డిమాండ్ కు తగ్గట్లు నగదు సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ ప్రకటించింది. ఏపీ, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల్లో ఉన్న నగదు కంటే ఉపసంహరణలు ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments