హైస్పీడ్ తో డబుల్ చేయనున్న కొత్త మెట్రో రైళ్ళు…

Wednesday, April 4th, 2018, 10:28:23 AM IST

హైదరాబాద్ లో జివ్వుమంటూ దూసుకేల్లిపోతున్న మెట్రోరైళ్ల సంఖ్య త్వరలో రెండింతలు కానున్నది. ప్రస్తుతం నడుస్తున్న నాగోల్ నుంచి మియాపూర్ వరకు గల 30 కిలోమీటర్ల మార్గంలో 16 రైళ్లను నడిపిస్తున్నారు. ఇందులో 14 రైళ్లు ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేరుస్తుండగా, మిగిలిన రెండు రైళ్లను అత్యవసరం కోసం ఉంచుతున్నారు. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌తో వీటి సంఖ్యను రెండింతలు చేయనున్నారు. రైళ్ల సంఖ్యతోపాటు వాటి వేగమూ మరింత పెరుగనున్నది. దీంతో రైళ్ల మధ్య ఫ్రీక్వెన్సీ తగ్గనున్నది. ప్రస్తుతం అమీర్‌పేట-మియాపూర్ మార్గంలో 8 నిమిషాలకో రైలు నడుస్తుండగా, నాగోల్- అమీర్‌పేట మధ్య 15 నిమిషాలకో మెట్రోరైలు నడుపుతున్నారు. రైళ్ల వేగం పెరుగాలని ప్రయాణికులు కోరుతుండటంతో స్పీడ్ పెంచాలని నిర్ణయించారు. గత నవంబర్ 28న ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో అమీర్‌పేట- మియాపూర్ మధ్య రైళ్లు వేగంగా వెళ్తున్నప్పటికీ, మెట్టుగూడ-అమీర్‌పేట మార్గంలో సాంకేతిక కారణాల వల్ల రైళ్లు కొంత నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి.

కమిషనర్ ఆఫ్ మెట్రోరైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) తనిఖీలు చేసి గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే స్పీడ్, ఫ్రీక్వెన్సీ పెంచాలనే నిబంధన ఉండటంతో ఇక్కడ మాన్యువల్‌గా ఆపరేట్ చేస్తున్నారు. తనిఖీలు పూర్తయ్యాక మరుసటి రోజు లేక ఆ తర్వాత రోజు నుంచి మెట్రోరైళ్ల సంఖ్య, వేగం, ఫ్రీక్వెన్సీలో భారీ మార్పులు రానున్నాయి.అయితే ప్రస్తుతం నడుస్తున్న మెట్రోరైళ్లలో 15 రోజుల్లో మార్పులు చేయడానికి అన్నివిధాలా తగు ప్రక్రియలు సిద్దం చేసారు. కాగా వారం రోజుల్లో సీఎంఆర్‌ఎస్ తనిఖీలు చేయనున్నట్టు సమాచారం. అనంతరం మాన్యువల్ ఆపరేటింగ్ కాకుండా కమ్యూనికేషన్స్ బేస్‌డ్ ట్రైన్ కంట్రోల్(సీబీటీసీ)టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నారు. సీబీటీసీ టెక్నాలజీతో రైళ్లను అనుసంధానం చేయడం ద్వారా రైళ్ల స్పీడ్‌ను సీబీటీసీ కేంద్రం నియంత్రిస్తుంది. అయితే అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీకి, ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు త్వరలో మెట్రో ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనిని అతిత్వరగా సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రోరైలు నిర్ణయించింది. అతి త్వరలోనే మరిన్ని రైళ్ళు, మరింత దూరంలో గమ్యం చేరుకోవడానికి కొత్త స్టేషన్లను కూడా సిద్దం చేస్తున్నారు.