ఈ – కుబేర్ తో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నెలసరి ఫించన్…

Tuesday, April 3rd, 2018, 11:22:19 AM IST

ప్రభుత్వ ఉద్యోగులకు, ఫించన్ అభ్యర్థులకు ప్రతే నేలా డబ్బులు పొందాలంటే బ్యాంకు ఉద్యోగులు ముప్పు తిప్పలు పెట్టిగానీ డబ్బులు ఇచ్చిన దాకలాలు లేవు. పెన్షనర్లు వేతన పింఛను పొందాలన్నా.. ఉద్యోగులు వేతనం తీసుకోవాలన్నా… ఇప్పటిదాకా బ్యాంకుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఉండేది. బిల్లు పాస్ చేసుకునేందుకు బ్యాంకు అధికారులను బతిమిలాడాల్సి వచ్చేది. అయితే ఈ పద్ధతికి ఆర్‌బీఐ చెక్ పెట్టింది. ఇకపై బ్యాంకులతో పనిలేకుండా నేరుగా పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేయనుంది. ఇందుకు గాను ట్రెజరీ శాఖల్లో ఈ -కుబేర్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతినెలా 1వ తేదీన, అది సెలవు రోజైనా సరే.. ఠంచనుగా పెన్షనర్లు, ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణలో భాగంగా గత నెల నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలో మార్చి నెలకు సంబంధించి పెన్షనర్ల వేతన పింఛను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి విజయవంతమయ్యారు. అది కూడా సెలవు రోజైన హోలీనాడు ఖాతాల్లో జమకావడం విశేషం.

దేశంలోని ఎనిమిది రాష్ర్టాల్లో ఈ- కుబేర్ విధానాన్ని అమలు చేయాలని భావించిన ఆర్‌బీఐ… ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తెలంగాణ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నది. తెలంగాణలోని 31 జిల్లాల్లో ఈ విధానం అమలు చేయగా, యాదాద్రి జిల్లా నెలరోజుల్లోనే వేగవంతంగా అమలు చేసి సక్సెస్ అయింది. ఇందుకు జిల్లా ట్రెజరీ అధికారులకు ఆర్‌బీఐ నుంచి ప్రశంసలు అందాయి. జిల్లాలో ప్రస్తుతం దాదాపు 3,339 మంది పెన్షనర్లు ఉండగా, వీరికి ప్రతీనెలా ట్రెజరీ ద్వారా రూ. 7,43,44,528 వరకు వేతన పింఛను చెల్లిస్తున్నారు. ఈ -కుబేర్ ద్వారా వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసి మార్చిలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇందుకు పెన్షనర్ల సంఘం తరపున కూడా ట్రెజరీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ-కుబేర్ పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులను కూడా తేవాలని ఆర్‌బీఐ, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసు, రెవెన్యూ, టీచర్లు, ఇతర ఉద్యోగులు 6,858 ఉన్నారు. త్వరలో వీరికి కూడా ఈ -కుబేర్ ద్వారా నేరుగా ఖాతాల్లో వేతనాలు జమ కానున్నాయి.