కరక్కాయల కేసులో కొత్త ట్విస్టు!

Thursday, August 23rd, 2018, 04:07:34 PM IST

ఇటీవల హైదరాబాద్ లోని కేపీహెచ్బి లో జరిగిన భారీ కరక్కాయల కేసు యావత్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ముప్పాల మల్లిఖార్జున్ నేతృత్వంలో కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1లో సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టి టూల్స్ ప్రైవేట్ పేరుతో భారీ ఎత్తున కరక్కాయల వ్యాపారం మొదలెట్టి, కిలో కరక్కాయలను రూ.1000కు తమ వద్దనుండి కొని, వాటిని పొడి చేసి తిరిగి ఇస్తే రూ.1300 ఇస్తామని మల్లిఖార్జున్ ముఠా నమ్మబలికింది. మొదట్లో కొందరికి కాయలు కొని పొడి చేసి ఇచ్చినందుకు ఈ ముఠా డబ్బులు సక్రమంగా చెల్లించడంతో ఆతరువాత ఎందరో వారిని నమ్మి కోట్లలో పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ.8 కోట్లరూపాయల మేర మోసం చేసిన ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు మల్లికార్జున్ ని అరెస్ట్ చేసి అతని నుండి నిజాన్ని రాబడుతున్న సైబర్ క్రైమ్ పోలీస్ లు, పట్టుబడిన సమయంలో అతని వద్ద వున్న రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ మోసంలో దాదాపు 600మంది అభాగ్యులు బలైనట్లు సమాచారం. మొదటగా భారీ మొత్తంలో కరక్కాయలను కొని పొడి చేసి తిరిగిచ్చిన వారికీ అదనంగా కేజీకి రూ.300 చొప్పున తిరిగి ఇచ్చిన ముఠా వసూలయిన సొమ్ములోనుండి దాదాపుగా రూ.6 కోట్లవరకు తిరిగి ఇచ్చారు.

అయితే ఇందులో ఒక కొత్త ట్విస్టు ఏంటంటే, మొదట్లో కొందరు కరక్కాయలను కొని వాటిని పొడి చేసి ఇచ్చి అత్యధిక లాభాలు పొందారని, అటువంటి వారు మళ్ళి పెట్టుబడిపెట్టేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. కాగా అలా లబ్ది పొందిన వారిలో కొందరు ముఠాగా ఏర్పడి దాదాపు రూ.2.4 కోట్ల డబ్బు రాబట్టుకున్నట్లు సమాచారం. ఇక అప్పటికే మరొక రూ.20 లక్షలు కూడా వారు సిబ్బంది వేతనాలు కార్యాలయ నిర్వహణ మరియు ఇతర ఖర్చుల నిమిత్తం ఖర్చు చేశారట. ఇకపొతె ఇవన్నీ కలిపి మొత్తంగా చూస్తే ఒక కోటి రూపాయలవరకు కోల్పోయిన సొమ్మును, మరియు ఆ ముఠా కాజేసిన రూ. 2.4 కోట్లను రాబట్టే అవకాశం లేకపోవచ్చని అంటున్నారు. మొదట్లో ఈ వ్యవహారంకోసం మల్లిఖార్జున్ బృందం కిలోకి రూ.50 చొప్పున 80 టన్నులను రూ.40 లక్షలు ఖర్చుపెట్టి హైదరాబాద్ లోని బేగం బజారులో బల్క్ లో కొనుగోలు చేశారట. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుని వదిలేది లేదని, అవకాశం వున్నంతవరకు పారిపోయిన మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకుని, బాధితులకు న్యాయం చేస్తామని అంటున్నారు…..