కిడారి హత్యలో టీడీపీ నేత హస్తం ?

Monday, October 1st, 2018, 09:48:03 AM IST

డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లివిటిపుట్టలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను వారం క్రితం మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హాత్యకు గల ప్రధాన కారణాలను ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు. సాధారణంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన తరవాత పోలీసులకు హత్యకు గల కారణాలకు సంబందించిన సమాచారం ఇవ్వడం మావోయిస్టుల ఆనవాయితీ.

కానీ ఘటన జరిగి వారం కావొస్తున్నా ఇంకా మావోల నుండి ఎలాంటి ప్రకటన, సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలోనే కిడారి సోమేశ్వరరావు హత్యలో మావోలకు అరకును చెందిన ఒక టీడీపీ ఎంపీటీసీ సహకరించారని, వ్యూహ రచన చేయడంలో సహాయపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. కిడారితో రాజకీయ విభేధాలున్న ఇతన్ని మావో నాయకులు కలిసి హత్యకు సహకరించాలని కొరారట. అందుకు అతను కూడ ఒప్పుకున్నాడట.

ఒప్పందం మేరకు కిడారిని గ్రామ దర్శినికి ఆహ్వానించిన సదరు ఎంపీటీసీ కిడారి కారు నెంబర్లు, ప్రయాణ వివరాలను మావోయిస్టులకు చేరవేశాడట. ఆ సమాచారంతోనే మావోలు కిడారిని హతమార్చారట. ఈ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఆరోజు గ్రామ దర్శినిలో పాల్గొనాల్సిన నేతలను, ఇతర వ్యక్తులను విచారిస్తోంది. ఈ కొత్త కోణంతో టీడీపీ వర్గాల్లో అలజడి మొదలైంది.