రాజ్‌కుంద్రా వ్యవహారంలో కొత్త ట్విస్ట్

Thursday, June 13th, 2013, 03:59:14 PM IST


రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాపై బెట్టింగ్ ఆరోపణల వ్యవహారం మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తనను పోలీసులు విపరీతంగా కొట్టి నేరం చేసినట్లు అంగీకరించాలని ఒత్తిడి చేశారని, దాని వల్లనే తాను రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా చెప్పాల్సి వచ్చిందని ఐపిఎల్ బెట్టింగ్ కుంభకోణంలో అరెస్టయిన బుకీ, రాజ్‌కుంద్రా వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయంకా అన్నాడు. కుంద్రాను ఇరికించడానికి తనచేతో ఒక ప్రకటన రాయించారని చెప్పాడు.పోలీసుల వేధింపులు తట్టుకోలేక మెజిస్ట్రేట్ ముందు ఆ రకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపాడు.

గోయెంకా ప్రకటన ఆధారంగానే కుంద్రా కూడా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు బయటకు వచ్చింది. ఢిల్లీ పోలీసుల సమాచారం మేరకు కుంద్రా కేవలం బెట్టింగ్‌లకే పాల్పడ్డాడని, ఫిక్సింగ్ చేయలేదని తెలుస్తోంది. కుంద్రాను ఇప్పటికే బిసిసిఐ సస్పెండ్ చేసింది. మరోవైపు తనపై చేసిన ఆరోపణలన్నీ ఆధారరహితమని , వీటికి సాక్ష్యాలేమీ లేవని కుంద్రా తెలిపాడు. ఈ అంశంలో తనను బలిపశువును చేశారని ఆరోపించాడు. తనకు ఇంగ్లండ్ పౌరసత్వం ఉందని ఇంగ్లండ్ చట్టాల ప్రకారం తాను బెట్టింగ్ చేయడానికి అర్హుడనంటున్నాడు.

గోయంకా చేత ఎవరు ఎందుకు అలా చెప్పించారో తెలియడంలేదు. ఒకవేళ ఇది నిజమైతే గనుకు పోలీసులను మేనేజ్ చేసింది ఎవరు అనేది తెలియాలి. కుట్రలో బాగంగానే ఇదంతా జరుగుతందా అనేది అనుమానం బలపడుతోంది. కానీ పోలీసులు మాత్రం బలవంతండా చెప్పించాల్సిన అవసరం మాకేంటి అని అంటున్నారు. గోయెంకా ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే కుంద్రాని ప్రశ్నించాం…అతను కూడా బెట్టింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు వివరణ ఇస్తున్నారు.