ఒక్క విజయం అతడి జీవితాన్నే మార్చేసింది!

Wednesday, July 10th, 2013, 01:30:43 AM IST


సొంతగడ్డపై వింబుల్డన్ టైటిల్ గెలవడంతో ఆ దేశపు ఆశాకిరణం ఆండీ ముర్రే పంటపండింది. మొత్తం బ్రిటన్ అంతా ముర్రే విజయంతో ఉద్వేగానికి లోనయింది. రాత్రంతా సంబరాలు జరుపుకుంది. 77 సంవత్సరాల తర్వాత తమ దేశానికి చెందిన వ్యక్తి టైటిల్ గెలవడంతో.. కార్పొరేట్స్ కూడా రంగంలోకి దిగారు. ముర్రేపై ఈ ఏడాది కనకవర్షం కురిసే అవకాశం ఉంది.

గత ఏడేళ్లుగా టెన్నిస్‌లో ఫెడరర్, నాదల్‌లదే హవా. ఈ ఇద్దరి మధ్యే ఆధిపత్య పోరు నడిచింది. క్రమంగా సీన్ మారిపోతోంది. జెకోవిచ్, ముర్రే ఈ ఇద్దరి స్థానాలను ఆక్రమించేస్తున్నారు. బ్రిటన్‌లో చిన్న విజయాలకే హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఇక ముర్రే వింబుల్డన్ టైటిల్ గెలవడంతో.. కార్పొరేట్స్ అతని ఇంటి ముందు క్యూ కడుతున్నారు. క్రీడా వ్యాపార కంపెనీల విశ్లేషణ ప్రకారం… ఈ ఏడాది ముగిసే సరికి ముర్రే ఆస్తి రూ.900 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ముర్రే 300 కోట్ల రూపాయలు సంపాదించాడు.. గత సెప్టెంబరులో యూఎస్ ఓపెన్ గెలిచాక ముర్రే ఆస్తి వంద కోట్ల రూపాయలు పెరిగింది. వింబుల్డన్ విజయంతో ఇతని సంపాదన రాకెట్ వేగంతో దూసుకుపోనుంది.

ఆండీ ముర్రే విజయం ఇంగ్లండ్‌లోనే కాదు.. భారత్‌లోనూ కొంతమందికి కనకవర్షం కురిపించనుంది. మహేశ్ భూపతికి చెందిన గ్లోబోస్పోర్ట్ సంస్థ.. ముర్రే స్పాన్సర్ షిప్ వ్యవహారాలు పర్యవేక్షిస్తోంది. ఇటీవలే ఈ సంస్థ ముర్రేతో ఒప్పందం కుదుర్చుకుంది. వింబుల్డన్ విజయం తర్వాత ఆసియాలో కొత్త భాగస్వాములతో ఒప్పందాల కార్యక్రమాన్ని భూపతి కంపెనీ చూసుకుంటుంది. సుమారు 10 నుంచి 12 కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉందని ముర్రే సన్నిహితులు తెలిపారు.

ముర్రే విజయంతో మొత్తం బ్రిటన్ పండగ చేసుకుంటుంటే.. అతను మాత్రం తీరిక లేకుండా గడిపాడు. ఆదివారం రాత్రంతా మేలుకొని వరుసగా జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచాక కూడా ఇంటర్వ్యూల పర్వం కొనసాగింది. ఈ విజయం తన మీద ఉన్న కొండంత బరువును దించిందని ముర్రే చెబుతున్నాడు. ఇన్నాళ్లూ వింబుల్డన్ విజయం వెంటాడుతుండటంతో.. ఒత్తిడిలో ఆడానని ఇకమీదట పూర్తి స్వేచ్ఛతో ఆడి మరిన్ని టైటిల్స్ గెలుస్తానంటూ పలు మీడియా సంస్థలకు తెలిపాడు. ఈ గెలుపును కొంతకాలంపాటు ఆస్వాదిస్తానని.. నాలుగైదు రోజులు సెలవు తీసుకుని, కుటుంబ సభ్యులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతానని తెలిపాడు.